విదేశాల్లో విద్యకు పంచ సూత్రాలు

విదేశీ చదువుల్లో ఆచితూచి అడుగు వేయాలి

వర్సిటీల గ్రేడింగ్‌, చరిత్ర తెలుసుకోవాలి 
అనామక వర్సిటీల్లో చేరితే ప్రయోజనం శూన్యం 
ఏజెన్సీలపై పూర్తిగా ఆధారపడొద్దు 
 
విదేశాల్లో చదువంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. పాశ్చాత్య దేశాల్లో విదేశీ విద్యార్థులపై పెరుగుతున్న నిఘా నేపథ్యంలో ఆచితూచి అడుగేయాల్సిన పరిస్థితులు నెలకుంటున్నాయి. కొద్ది రోజుల కిందట అమెరికాలోని రెండు యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులను వెనక్కి పంపేశారు. ఇలాంటి వ్యవహారాల్లో తప్పెవరిదైనా నష్టపోయేది మాత్రం విద్యార్థులే. విదేశాల్లోని వర్సిటీల్లో చేరాలనుకుంటే ఒకటికి పది సార్లు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.
 
విదేశాల్లోని కళాశాలలు, వర్సిటీలన్నీ మన దేశంలో వాటికంటే గొప్పవేమీ కావు. అమెరికా దేశాన్ని చూసుకుంటే అక్కడివన్నీ వర్సిటీలుకావు. మన దేశంలో కళాశాలలుగా పిలిచే విద్యాసంస్థలనే అక్కడ వర్సిటీలు అంటారు. అగ్రరాజ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో వందల సంఖ్యలో యూనివర్సిటీలు ఉన్నాయి. వీధి చివరన ఓ భవనంలో నిర్వహించే కళాశాలలను సైతం అక్కడ వర్సిటీ అనే అంటారు. మన విద్యార్థులను వెనక్కు పంపిన రెండు వర్సిటీలు ఇటువంటివే. ఎన్నో విదేశాల్లోని వర్సిటీల్లో ఇదే పరిస్థితి ఉంటుంది. ఇంటర్నెట్‌ ద్వారా కోర్సులు అందించే వర్చువల్‌ వర్సిటీలు ఉంటాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారు ఆయా వర్శిటీల స్థాయి, చరిత్ర, ఫ్యాకల్టీ వివరాలు, గ్రేడింగ్‌ వంటి విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఇందుకు ఆయా దేశాల్లో స్థిరపడిన వారి ద్వారా వాకబు చేయడం మంచిది. విదేశాలకు వెళ్తున్నామనే మోజులో ఎక్కువ మంది కేవలం ఏజెన్సీలను నమ్మి నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో ఎక్కువ మంది మోసాలకు గురవుతున్నారు. కమిషన్‌ కోసం పని చేసే సంస్థలు చివరివరకు మన బాధ్య త తీసుకోవన్నది గుర్తించాలి.

గోల్డ్‌ పక్కనే రోల్డ్‌ గోల్డ్‌ 
అమెరికా వంటి దేశంలో చదువుకు మంచి అవ కాశాలున్నాయన్నది వాస్తవం. గోల్డ్‌ పక్కనే రోల్డ్‌ గోల్డ్‌ ఉన్నట్లే అనామక వర్శిటీల గురించి తెలుసుకోవాలి. అది మన బాధ్యతే. ప్రతిభకు పట్టం కట్టే దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంటుంది. కాకపోతే ఎంచుకునే వర్సిటీ మన తెలివితేటలపైనే ఆధారపడి ఉంటుందన్నది మరువకూడదు.
 
నిపుణులు ఏం చెబుతున్నారంటే .. 
  • వర్సిటీకి గ్రేడింగ్‌ ఉందా..? చరిత్ర ఏమిటి. అది ప్రభుత్వ ఆధ్వర్యంలోనిదా, ప్రైవేట్‌ రం గంలోనిదా..? ప్రైవేట్‌ అయితే నిర్వాహకుల పరిస్థితి ఏమిటి.. ఇవన్నీ తెలుసుకోవాలి. 
  • గతంలో తొలుత చిన్న వర్సిటీలో చేరి అనంతరం మంచి వర్సిటీకి బదిలీ అయ్యే అవకాశం ఉండేది. అమెరికా చదువుకు అప్పట్లో అదో మార్గంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ చేరితే చివరి దాకా అక్కడే కొనసాగాలి. 
  • విదేశాలకు విద్యార్థులను పంపే ఏజెన్సీల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. కమిషన్‌ మాత్రమే పరమావధిగా భావించే ఏజెన్సీలకు లెక్కే లేదు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. 
  • మెరిట్‌ ఉంటే మంచి యూనివర్శిటీలోనే సీటు దక్కుతుంది. సాధారణ విద్యార్థులు అయితే మాత్రం కష్టమే. అటు వంటి వారు ఒకటికి వంద సార్లు ఆలోచించాలి. 
  • ఆ దేశంలోని పరిస్థితులు, విదేశీయులపై అక్కడి ప్రభుత్వాలు తీసుకుంటు న్న చర్యలు, ఆంక్షలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.