2018 మోగించిన సైబర్ వార్నింగ్ బెల్స్

ఈ యేడాది సైబర్‌ నేరాలు మరింత పెరిగాయి. వార్నింగ్‌బెల్స్‌ మోగించాయి. సైబర్‌ సెక్యూరిటీ మీద అటెన్షన్‌ను పెంచాయి. జాక్‌పాట్‌ ఎటాక్ బ్యాంకులను షేక్‌ చేశాయి. సైబర్ నేరాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఓ రకంగా శాసిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా ప్రగతికి దోహద పడుతోందో.. అదే స్థాయిలో నేరాలు కూడా కోరలు చాస్తున్నాయి. సాంకేతిక నైపుణ్యాన్ని సన్మార్గంలో వినియోగించాల్సిన కొందరు దుర్బుద్ధితో సవాల్‌ విసురుతున్నారు. ఫలితంగా సైబర్‌ వార్నింగ్‌ బెల్స్‌ మోగుతున్నాయి.

2018 యేడాదిలో సైబర్‌ ఎటాక్స్‌, మాల్‌వేర్‌ ఎటాక్స్‌, పర్సనల్‌ డేటా లీక్స్‌, మోమో ఛాలెంజ్‌లు ఎక్కువయ్యాయి. 2017లో ఈ తరహా దాడులు భారీగా జరగ్గా.. ఈ యేడాది కూడా అవి కొనసాగాయి. కంప్యూటర్‌, ఇంటర్నెట్‌లతో అనుసంధానమైన వ్యవస్థలను షేక్‌ చేశాయి. సైబర్‌ సెక్యూరిటీ మీద అటెన్షన్‌ పెంచాయి. ఇక్కడా, అక్కడా అని కాదు.. ఈ దేశం, ఆదేశానికని పరిమితులు లేవు. ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా దాడులు జరుగుతున్నాయి. ఎక్కడో ఊరూ పేరూ లేని దేశంలో నుంచి మరెక్కడో ఖండాంతరాల అవతల ఉన్న దేశాల్లోనూ సైబర్‌ దాడులకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఆనవాళ్లు, ఆధారాలు కూడా దొరక్కుండా హెచ్చరికలు చేస్తున్నారు. బాధితులకు ముచ్చెమటలు పోయిస్తున్నారు. సైబర్‌ సెక్యూరిటీ పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ల సవాళ్లను ఎదుర్కోలేక పోతున్నారంటే సైబర్ దొంగలు ఎంతగా ముదిరిపోయారో అర్థం చేసుకోవచ్చు.
 
సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించిన దాడులు ఈ యేడాది ఎక్కువగా కొనసాగాయి. ఫిషింగ్ ఎటాక్స్ మామూలు ఫేస్‌బుక్‌ యూజర్‌ దగ్గర్నుంచి.. వందలకోట్ల టర్నోవర్‌ ఉన్న సంస్థల దాకా వణుకు పుట్టించాయి. ఏటీఎం ఫ్రాడ్స్‌, స్కిమ్మర్‌ ఎటాక్స్‌ కూడా బ్యాంకులను తలలు పట్టుకునేలా చేశాయి. ఇక.. యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్స్‌లను దొంగిలించి వ్యక్తిగత డేటా చౌర్యానికీ పాల్పడ్డారు.
 
ప్రధానంగా ఈ యేడాది కొన్ని సంఘటనలు అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించాయి. కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా ఇష్యూ ఫేస్‌బుక్‌ అధిపతి మార్క్‌ జుకర్‌ బర్గ్‌ను వివరణ ఇచ్చేలా చేసింది. 'డిలీట్‌ ఫేస్‌బుక్‌' అనే ఓ ఉద్యమానికి కూడా కారణభూతమైంది. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ డేటా చోరీ.. హ్యాకర్ల ఆగడాలకు అద్దం పట్టింది. మోమో ఛాలెంజ్‌.. బ్లూవేల్‌ మాదిరిగా ఆత్మహత్యలకు ఉసిగొల్పింది.
 
గతేడాది వరకూ రష్యాకే పరిమితమైన భయంకరమైన ఏటీఎం మాల్‌వేర్‌ ఎటాక్ ఇప్పుడు ఆ దేశం దాటింది. మనదేశంలోనూ ముంబైలో ఈ తరహా సైబర్‌ దాడి బ్యాంకులకు సవాల్‌గా నిలిచింది. ఓ ల్యాప్‌ట్యాప్‌తో ఏటీఎంను అనుసంధానించి.. జాక్‌పాట్‌, హనీపాట్‌ వంటి మాల్‌వేర్‌లను ఇన్‌స్టాల్‌ చేయడం ద్వారా ఏ రకమైన కార్డు ఇన్‌సెర్ట్‌ చేయకుండానే ఆ ఏటీఎంలో ఉన్న డబ్బులన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ తరహా ఎటాక్స్‌ జరగ్గానే ఏటీఎంలను మూసేశారు. భారత్‌తో పాటు.. యూరోపియన్‌ దేశాల్లోనూ ఈ దాడులు జరిగినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
 
ప్రపంచ వ్యాప్తంగా మాల్‌వేర్‌, రాన్సమ్‌వేర్‌ ఎటాక్స్‌ కార్పొరేట్‌, ఐటీ సంస్థలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా ఐటీ కంపెనీలు.. సైబర్‌ సెక్యూరిటీ మీద ఎక్కువగా దృష్టి సారించాల్సి వస్తోంది. ఇంతకాలం డేటా, బిజినెస్‌ మీదే ఫోకస్‌ చేసిన బడా సంస్థలు.. ఇప్పుడు సైబర్‌ సెక్యూరిటీ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. వాస్తవానికి 2017లో ఎటాక్‌ చేసిన వాన్నా క్రై రాన్సమ్‌వేర్‌ ఈ పరిణామాలకు కారణమైతే.. 2018లోనూ ఇది కొనసాగింది.
 
ఇక.. సైబర్‌ ఆధారిత పోర్నోగ్రఫీ ఈ యేడాది కూడా సమాజాన్ని అతలాకుతలం చేసింది. మొబైల్‌ సంస్థలు పోటా పోటీగా ఉచిత డేటా ఆఫర్లు ఇవ్వడం, ఇన్నాళ్లుగా ఉన్న మొబైల్‌ ఫోన్లన్నీ.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లుగా మారిపోవడం.. విపరీత పరిణామాలకు కారణమైంది. బడికెళ్లే పసివాళ్ల దగ్గర్నుంచి.. కాటికి కాళ్లు చాపిన పండు ముదుసళ్లదాకా పోర్నోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా పోర్నో సంబంధిత నేరాలు భారీగా పెరిగాయి.
 
- సప్తగిరి.జి (ఏబీఎన్‌ రెడ్‌అలర్ట్‌ డెస్క్‌ ఇంచార్జ్‌)