ఈ 9 దేశాల్లో పర్మినెంట్‌గా ఉండొచ్చు

దేశాల మధ్య స్నేహసంబంధాలు పెంపొందించడానికి, పర్యాటక రంగానికి ఊతం ఇచ్చి ఆదాయాన్ని పెంచుకోవడానికి వివిధ దేశాలు తమ విదేశాంగ విధానాన్ని ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటాయి. విదేశీయులను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి. అందులో భాగంగానే వీసా లేకుండానే దేశంలోకి వచ్చేయొచ్చు.. ఇక్కడకు రాగానే వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చంటూ ప్రకటిస్తుంటాయి. వివిధ రకాల వీసాల ద్వారా కొన్ని ఏళ్ల పాటు ఉండొచ్చు. అమెరికాలో గ్రీన్ కార్డు లాంటివి ఇచ్చినా.. వారిని శాశ్వత నివాసి అని పిలవరు. కానీ ప్రపంచంలో కేవలం 9 దేశాలు మాత్రం.. కొన్ని నిబంధనలతో పర్మినెంట్ రెసిడెన్సీని విదేశీయులకు కల్పిస్తాయి. మరి ఆ దేశాలు ఏంటో.. ఆ నిబంధనలేమిటో ఓ లుక్కేద్దామా..?
 
1. బెలిజే(Belize): ఈ దేశంలో వరుసగా అయిదు సంవత్సరాలు నివసిస్తే చాలు.. శాశ్వత నివాసిగా గుర్తిస్తారు. అంతేకాక నెలకు రెండు వేల డాలర్లు సంపాదిస్తున్నట్లు బ్యాంకు బ్యాలెన్స్ చూపించాలి. ఈ దేశంతో యుద్ధానికి దిగిన దేశాలకు చెందిన వారు మాత్రం శాశ్వత నివాసానికి అర్హులు కారు. 
 
2. ఎక్యాడార్ (Ecuador): ఓ వెయ్యి డాలర్లు ఉంటే చాలు ఈ దేశంలో పర్మినెంట్ రెసిడెన్సీ పొందొచ్చు. కాకపోతే ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు. నెలకు 800 డాలర్లు సంపాదించాలి. రియల్ ఎస్టేట్ మార్కెట్లో 25 వేల డాలర్ల పెట్టుబడి పెట్టాలి. 
 
3. సేచెల్లెస్ (Seychelles): ఈ దేశంలో పర్మినెంట్ రెసిడెన్సీ కావాలంటే కొంత ఖర్చుతో కూడుకున్న పనే. ఒక్కో వ్యక్తికి 12500 డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు, సంస్కృతికి తన వంతు సహాయం చేస్తాననే నమ్మకాన్ని అధికారులకు కలిగించాలి. 
 
4. పనామా (Panama): అయిదు సంవత్సరాలకు ఒకసారి రెన్యూవల్ చేసే పర్మినెంట్ రెసిడెన్సీని ఈ దేశం అందిస్తుంది. మెడికల్ పరీక్షలన్నీ పూర్తయిన తర్వాతే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. పనామా దేశానికి చెందిన వేరెవరినైనా పెళ్లాడితే.. ఆ దేశ పౌరుడిగా గుర్తిస్తారు. అంతేకాక ఈ దేశానికున్న 50 మిత్ర దేశాల వారికి అతి త్వరగా పర్మినెంట్ రెసిడెన్సీ వస్తుంది. 
 
5. పరాగ్వే (Paraguay): ఈ దేశానికి చెందిన ఏదయినా బ్యాంకులో 5200 డాలర్లను జమ చేస్తే ఆ దేశంలో నివాసిగా ఉండొచ్చు. మూడేళ్ల తర్వాత పౌరసత్వానికి దరఖాస్తు చేయొచ్చు. ఈ దరఖాస్తు మరో ఏడాదిలో అప్రూవల్ పొందుతుంది. 
 
6. మసెడోనియా (Macedonia): 4 లక్షల యూరోలను ఈ దేశ పారిశ్రామిక రంగంలో పెట్టుబడిగా పెడితే చాలు.. పర్మినెంట్ రెసిడెన్సీ ఇచ్చేస్తారు. ఏడాదిలోపే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. 
 
7. హంగేరీ (Hungary): 3 లక్షల యూరోలను పెట్టుబడిగా పెడితే.. ఈ దేశ పౌరసత్వం మీ సొంతం. కేవలం రెండు నెలల్లో ఆ దేశ పౌరుడిగా మారిపోవచ్చు. 
 
8. డొమినికన్ రిపబ్లిక్ (Dominican Republic): ఈ దేశ పర్మినెంట్ రెసిడెన్సీని పొందాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. అయితే రెండు లక్షల డాలర్లను పెట్టుబడిగా పెడితే ఈ సమయం కాస్త తగ్గొచ్చు. 
 
9. రష్యా: ఈ దేశ పౌరసత్వం పొందేందుకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించారు. 2002 నుంచి 2006లోపు పలు దఫాలుగా ఈ చట్టంలో మార్పులు జరిగాయి. పన్నులు కట్టే స్థాయికి ఎదిగితే ఈ దేశ పౌరుడిగా అర్హత సాధించినట్లే. రష్యా భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే భాషా సామర్థ్యాన్ని నిరూపించుకునే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.