భారత్‌ యూనివర్శిటీల్లో భారీగా విదేశీ ప్రొఫెసర్లు

న్యూఢిల్లీ: భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాల బాట పడుతున్నారన్న విషయం తెలిసిందే. యేటేటా వీరి సంఖ్య పెరుగుతూనే ఉంది. అలా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులను ఆకట్టకుని ఇక్కడే చదివించేలా పలు యూనివర్శిటీలు వినూత్న ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిలో భాగంగానే అయిదేళ్లుగా పలు యూనివర్శిటీలు విదేశాల్లో పేరు పొందిన ప్రొఫెసర్లను ఇక్కడకు రప్పిస్తున్నాయి. మెడికల్, ఇంజనీరింగ్, కంప్యూటర్ స్ట్రీమ్స్‌లో వివిద దేశాల్లో గొప్ప పేరు సంపాదించిన ప్రొఫెసర్లు ఇప్పుడు భారత్ బాట పడుతున్నారు. ఆయా యూనివర్శిటీలు ఇచ్చే జీతాల కంటే ఎక్కువగానే ఇచ్చి, పలు సదుపాయాలను కల్పించి తమ యూనివర్శిటీలో చేరేలా వాటి యాజమాన్యం ఒప్పించగలుగుతోంది. ఇలా వారిని రప్పించి అడ్మిషన్ల సమయంలో ఫలానా ప్రొఫెసర్ మా యూనివర్శిటీలో ఉన్నారంటూ పబ్లిసిటీ చేసుకోవడం ద్వారా కొంతమేర విద్యార్థులను అట్రాక్ట్ చేయొచ్చన్నది వారి అభిప్రాయం. ఇది బాగానే పనిచేయడంతో దేశ వ్యాప్తంగా పలు యూనివర్శిటీల్లో ప్రస్తుతం 500కు పైగా విదేశీ ప్రొఫెసర్లు పాఠాలు చెబుతున్నారు. అలా వచ్చిన వారికి ప్రత్యేక డిజిగ్నేషన్ కూడా ఇస్తున్నారట. 

 
గడచిన అయిదేళ్లుగా ఐఐటీ మద్రాస్‌లో 168 మంది, ఐఐటీ- బాంబే 96 మంది, అమ్రితా యూనివర్శిటీ 198 మంది, శాస్త్రా యూనివర్శిటీ 40, ఎస్ఆర్ఎమ్ యూనివర్శిటీ 36, మనిపాల్ యూనివర్శిటీ 11 మందిని విదేశీ ప్రొఫెసర్లను రిక్రూట్ చేసుకుంది. వీరంతా గతంలో అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాల్లో పలు యూనివర్శిటీల్లో పనిచేసినవారే.