Weekend-Cinema-releasing-lakshmis-ntr-in-Overseas

ఓవర్సీస్‌లో కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతోన్న లక్ష్మీస్ ఎన్టీఆర్

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్‌గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎట్టకేలకు రేపు విడుదల అవుతోంది. అయితే ఏపీ హైకోర్టు మాత్రం ఈ చిత్ర విడుదలకు నో చెప్పింది. ఏప్రిల్ మూడు వరకూ సినిమాను విడుదల చేయరాదని ఆదేశించింది. అంతకుముందు ఈ సినిమా విడుదలతో తమ మనోభావాలు దెబ్బతింటాయంటూ దాఖలైన పిటిషన్‌పై స్పందించిన మంగళగిరి కోర్టు సినిమా విడుదలపై స్టే ఇచ్చింది. ఏప్రిల్‌ 15 వరకు సినిమా విడుదలను ఆపేయాలని పిటిషనర్ కోరారు. దీంతో ఈ కేసులో పిటీషన్‌కు అనుకూలంగా మంగళగిరి కోర్టు తీర్పు ఇస్తూ.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలపై స్టే ఇచ్చింది. దీంతో ఏపీ మినహా తెలంగాణ, మిగిలిన అన్ని ప్రాంతాలలో ఈ సినిమా రేపు విడుదల అవుతోంది. 

అమెరికాలో కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. మార్చి 28న 125కు పైగా లొకేషన్లలో ఈ సినిమా ప్రీమియర్లు పడనున్నాయి. అమెరికాలో వీకెండ్ సినిమా సంస్థ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను విడుదల చేస్తోంది. అమెరికాలోని తెలుగు వారు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలు విడుదలైనప్పటికీ.. ప్రేక్షకులు లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను ఆ రెండు భాగాలకు సీక్వెల్‌గా భావిస్తున్నారు.