Syndicate-Behind-Sye-Raa-Shows-Cancelled-in-Canada

కెనడాలో 'సైరా' ప్రదర్శనల నిలిపివేత వెనుక సిండికేట్ మాఫియా?

టొరొంటో: అక్టోబర్ 2న గాంధీజయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు కెనడాలోని టొరొంటోలో బ్రేక్ పడింది. అక్కడ ఈ సినిమా ప్రదర్శనను రద్దు చేశారు. ఒంటారియోలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సినిమా ప్రదర్శితమవుతున్న ల్యాండ్‌మార్క్ సినిమాస్‌లోకి ప్రవేశించిన ఓ దుండగుడు ఒక్కసారిగా కత్తి బయటకు తీసి తెరను చించేశాడు. అనంతరం ప్రేక్షకులపై పెప్పర్ స్ప్రే‌ను చిమ్మి పరారయ్యాడు. విట్బీలోనూ ఇటువంటిదే మరో ఘటన జరిగింది.

రెండు ఘటనలు ఒంటారియో ప్రావిన్స్‌లోనే జరిగాయి. సినిమా తెలుగులో ప్రదర్శితమవుతుండడంతో కావాలనే ఇలా చేశారని సమాచారం. ఇటువంటివే మరికొన్ని ఘటనలు జరిగాయి. ఓ ప్రాంతంలో జరిగిన ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడడమో, మరణించడమో జరిగిందని సమాచారం. దీంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం కావడంతో ముందు జాగ్రత్త చర్యగా షోలను నిలిపివేశారు. 

అయితే, ఈ ఘటన వెనుక అసలు కారణం అక్కడి స్థానిక సిండికేట్ మాఫియా అని సమాచారం. ఓ తెలుగు వ్యక్తి, ముగ్గురు తమిళులు కలిసి సిండికేట్‌గా ఏర్పడి సైరా షోలను క్యాన్సిల్ చేయించారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ సిండికేట్ గ్రూపుకు చెందిన వ్యక్తులు ఇతర భాషలకు చెందిన సినిమాలను వారికి తెలిసిన థియేటర్లలో నాలుగు నుంచి ఐదు దేశీ స్క్రీన్స్‌లో విడుదల చేస్తుంటారు. అలాగే మూవీ కలెక్షన్ల విషయంలో కూడా ఈ సిండికేట్ గ్రూపు గోల్‌మాల్‌కు పాల్పడుతుంటుంది. ఉదాహరణకు వారు తమ థియేటర్లలో ప్రదర్శించిన సినిమా రూ. 70 లక్షలు వసూలు చేస్తే, ఈ మాఫియా మాత్రం రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షలు అని మాత్రమే చూపిస్తుందట.

ఇలా చాలా కాలంగా ఈ సిండికేట్ గ్రూపు తప్పుడు లెక్కలను చూపిస్తూ చెలామణి అవుతోంది. అయితే, సైరాను ఓ పంజాబీ వ్యక్తి కొనుగోలు చేసి ప్రముఖ ల్యాండ్‌మార్క్ సినీప్లస్‌లలో విడుదల చేశాడు. వసూళ్లు కూడా బాగా వస్తున్నాయి. దీంతో సిండికేట్ మాఫియా ఒకవేళ పంజాబీ వ్యక్తి సైరా కలెక్షన్లను ఉన్నవి ఉన్నట్టుగా బయటకు చూపిస్తే ఇన్నాళ్లు తాము గోల్‌మాల్‌కు పాల్పడుతున్న విషయం బయట పడుతుందని, సినిమా షోలను ఎలాగైన రద్దు చేయించాలని భావించాయి. వెంటనే అపరిచితులను మూవీ ప్రదర్శితం అవుతున్న థియేటర్లకు పంపించి గొడవలకు పాల్పడి షోలను రద్దు అయ్యేలా చేశాయని బోగాట. కాగా, అసలు కారణం ఏమిటనేది మాత్రం తెలియాల్సి ఉంది.