syeraa-step-into-list-of-top-10-telugu-grossers-in-overseas

ఓవర్సీస్‌లో టాప్‌10లోకి దూసుకొచ్చిన ‘సైరా’..

ఓవర్సీస్ సినిమా: మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. స్వాతంత్ర్యసమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా కనిపించిన మెగాస్టార్ తెలుగు ప్రేక్షకులను ముగ్ధుల్నిచేశారు. తొలి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ క్రమంలో ఓవర్సీస్ మార్కెట్లో కూడా రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ కలెక్షన్లను అధిగమించింది. దీంతో ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు చిత్రాల జాబితాలో 10వ స్థానానికి ‘సైరా’ చేరింది.

ఈ చిత్రం యూఎస్‌ఏలో సుమారు 24,48,312డాలర్లు(రూ.17కోట్లపైగా) వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రం ఓవర్సీస్‌లో కనీసం 3.2మిలియన్ డాలర్లు సాధించాల్సి ఉంది. లేదంటే ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు కొంతమేర నష్టాల్ని చవిచూడాల్సి వస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అలానే ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల టాప్‌10 జాబితాలోకి దూసుకొచ్చిన ఈ చిత్రం.. ఇంకా ఎంత వసూలు చేస్తుందో తెలియాలంటే వేచిచూడక తప్పదంటున్నారు.

 

ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు చిత్రాలివే..

1. బాహుబలి 2: ద కంక్లూజన్ - 20.5మిలియన్ డాలర్లు

2. బాహుబలి: ద బిగినింగ్ - 6.9మిలియన్ డాలర్లు

3. రంగస్థలం - 3.51మిలియన్ డాలర్లు

4. భరత్ అనే నేను - 3.4మిలియన్ డాలర్లు

5. సాహో - 3.2మిలియన్ డాలర్లు

6. శ్రీమంతుడు - 2.9మిలియన్ డాలర్లు

7. మహానటి - 2.54మిలియన్ డాలర్లు

8. గీతగోవిందం - 2.46మిలియన్ డాలర్లు

9. అ..ఆ! - 2.44మిలియన్ డాలర్లు

10. సైరా నరసింహారెడ్డి - 2.4మిలియన్ డాలర్లు