Sye-Raa-Visual-effects-work-is-being-done-in-10-countries

10 దేశాలు... 26 ప్రదేశాలు... సైరా... సై సై రా!

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. నయనతార, తమన్నా కథానాయికలు. సురేందర్‌రెడ్డి దర్శకుడు. చిరు సతీమణి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై ఆయన తనయుడు రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు, తెలుగు వీరుడు ఉయ్యాడలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా రూపొందుతోంది. ప్రస్తుతం పది దేశాలు... 26 ప్రదేశాల్లో... ‘సైరా’ విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు జరుగుతున్నాయి. నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా శరవేగంగా పనులు సాగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే, స్వరకర్త అమిత్‌ త్రివేదీ నేతృత్వంలో ముంబైలో సాంగ్స్‌ వాయిస్‌ మిక్సింగ్‌ జరుగుతోంది. మరోపక్క నేపథ్య సంగీత దర్శకుడు జూలియస్‌ పేకియమ్‌ నేతృత్వంలో రీ రికార్డింగ్‌ కూడా జరుగుతోంది. చెన్నైలో స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ పనులు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే సంకల్పంతో చిత్రబృందం ముందుకు వెళుతోంది.