Sye-raa-Movie-Team-Changed-their-Decision-with-the-Effect-of-Saaho-Result

'సైరా' టీమ్ కొత్త వ్యూహం.. 'సాహో' విషయంలో జరిగిన ఆ తప్పు రిపీట్ అవకుండా..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ సాహో. తొలి ఆట నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా మన దగ్గర పర్వలేదనిపించిన ఓవర్సీస్‌లో మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు నష్టాన్నే మిగిల్చింది. అయితే, యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ప్రారంభం నుంచి ఇలా పూర్తిగా డీలా పడిపోవడానికి ముఖ్య కారణం అక్కడి డిస్ట్రిబ్యూటర్ల స్వయం కృత అపరాధమేనట. తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్‌కే ఎక్కువ థియేటర్లు కేటాయించడమే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చేసిన పెద్ద తప్పు. అయితే డిస్ట్రిబ్యూటర్లు మాత్రం మరో విధంగా ఆలోచించారు. బాహుబలి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సాహోను కూడా తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్‌కే ఎక్కువ థియేటర్లు కేటాయించారు.  కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. 
 
ఇంకో విషయం ఏమిటంటే అమెరికాలో హిందీ మార్కెట్ కంటే తెలుగు మార్కెటే అధికం. అక్కడ ఉండే తెలుగు వారు హిందీ కంటే తెలుగులో చూడడానికే మొగ్గుచూపుతారు. ఈ విషయాలన్ని గ్రహించకుండా డిస్ట్రిబ్యూటర్లు గుడ్డిగా హిందీ వెర్షన్‌కు భారీగా థియేటర్లు కేటాయించడం, దానికి తోడు సాహోకు తొలి ఆట నుంచే డివైడ్ టాక్ రావడంతో ఓవర్సీస్‌లో మూవీ కలెక్షన్లు భారీగా పడిపోవడానికి కారణమైంది. 
 
అయితే, సాహో సినిమా నుంచి నేర్చుకున్న పాఠంతో.. సైరా టీమ్ కాస్త తెలివిగా ఆలోచిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ మాత్రం ఆ తప్పు చేయడం లేదు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు సాధ్యమైనంత వరకు ఎక్కువ థియేటర్లు తెలుగు వెర్షన్‌కే కేటాయించాలని సైరా మేకర్స్ సూచించారట. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే హిందీ వెర్షన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారట. యూఎస్‌లో తెలుగు మార్కెట్ ఎక్కువ కాబట్టి తప్పకుండా ఈ వ్యూహం సైరాకు కలిసోస్తుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఇదిలా ఉంటే 'సైరా' మూవీ యూఎస్ఎలో కూడా భారీగా విడుదల కాబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన బిజినెస్ జరిగిపోయినట్లు సమాచారం. భారత్‌లో ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలవుతోంది.. అంటే అమెరికాలో అక్టోబర్ 1నే ప్రీమియర్ షోలు ఉంటాయి. అక్టోబర్ 1న మంగళవారం కావడం.. అమెరికాలో సైరా సినిమాకు కాస్త అడ్వాంటేజ్‌గా మారనుంది. యూఎస్‌లో ప్రతి మంగళవారం పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు, యాప్స్‌ పలు ప్రత్యేక ఆఫర్లను ఇస్తుంటాయి. ఇక సైరా ఇప్పటికే ప్రీ-సేల్స్ రూపంలో 167 ప్రాంతాల నుంచి సుమారు రూ. కోటి 85 లక్షలు రాబట్టింది. శుక్రవారం నాటికి హాఫ్ మిలియన్ మార్క్‌ను దాటడం ఖాయమని సినీ పండితుల అంచనా. మంగళవారం విడుదల కూడా సైరాకు కలిసి రానుంది. 
 
ఇంతకుముందు కూడా చిరు 150వ మూవీ ఖైదీ నెంబర్ 150 యూఎస్‌లో 2.45 మిలియన్ డాలర్ల కలెక్షన్లను చేరుకోగా.. ప్రీమియర్ల ద్వారానే ఒక మిలియన్ డాలర్ మార్కును అందుకుంది. ఇక సైరాను ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. చిరు తనయుడు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ బ్యానర్‌‌పై దాదాపు 250 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మించారు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, జగపతి బాబు, తమన్నా, అనుష్క ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇలా భారీ తారాగణంతో 'సైరా' తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిన సంగతి తెలిసిందే.