Srinivas-Avasarala-starrer-NRI-to-be-launched-on-Feb-20

అవసరాల శ్రీనివాస్ హీరోగా ఎన్నారై(నాయనా..రారా ఇంటికి)

సినిమా మీద ప్రేమతో అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదులుకుని హైదరాబాద్‌కు వచ్చేసిన నటుడు అవసరాల శ్రీనివాస్. ‘అష్టాచమ్మా’తో మొదటి సినిమాకే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత చాలా సినిమాలలో అవసరాల శ్రీనివస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశారు. ఊహలు గుసగుసలాడే సినిమాతో డైరెక్టర్‌గా కూడా ఆయనేంటో నిరూపించారు. గతేడాది బాబు బాగా బిజీ అనే సినిమాలో ఆయన ప్రధాన పాత్రధారిగా నటించాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తరువాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ వస్తున్న అవసరాల తాజాగా ఎన్నారై(నాయనా రారా ఇంటికి) అనే సినిమాలో ప్రధాన పాత్రధారిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో మంచు లక్ష్మీ కూడా ప్రధాన పాత్రలో నటించనున్నారు. వీరితో పాటు మహతి, నాగబాబు కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. కేఆర్ ప్రదీప్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాల శేఖర్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో చిత్రం లాంఛన కార్యక్రమం జరగనుంది. ఈ చిత్రంలోని పాటలన్నిటినీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాస్తుండగా..ఆయన కుమారుడు యోగేశ్వర శర్మ సంగీతం సమకూరుస్తుండటం విశేషం.