Special-Interview-with-Director-Ramana-Teja

ఆ కామెంట్స్‌ చదివి అమెరికా వెళ్లా!

చిత్రజ్యోతి: ‘‘మా కుటుంబ సభ్యులంతా సినిమాలు బాగా చూస్తారు. నేను సినిమా బావుందంటేనే వెళ్లేవాణ్ణి. మా నాన్న మెగాస్టార్‌కు వీరాభిమాని. చిరంజీవి అంటే పిచ్చి. అదే నన్ను సినిమాలవైపు నడిపించిందేమో! చిరంజీవి సినిమాలు చూసి వచ్చాక... ఇంట్లో ఎలా ఉందో చెప్పేవారు. బీటెక్‌ చివరి సంవత్సరంలో ఉండగా... ఒక షార్ట్‌ ఫిల్మ్‌ చేశా. దానికి వచ్చిన స్పందన చూశాక... దర్శకుడు కావాలనుకున్నా’’ అని రమణతేజ అన్నారు. నాగశౌర్య, మెహరీన్‌ జంటగా ఉషా మూల్పూరి నిర్మించిన ‘అశ్వథ్థామ’తో ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శుక్రవారం సినిమా విడుదలవుతోన్న సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలివీ... 

మాది చిత్తూరు జిల్లా మదనపల్లి. స్కూలింగ్‌ అంతా అక్కడే. తమిళనాడులో బీటెక్‌ చేశా. రాజశేఖర్‌ ‘గడ్డం గ్యాంగ్‌’కి సహాయ దర్శకుడిగా చేశా. తర్వాత 30 నిమిషాల షార్ట్‌ ఫిల్మ్‌ ‘దుష్టశిక్షణ’ చేశా. యుట్యూబ్‌లో స్ర్కీన్‌ప్లే ల్యాగ్‌ అని కామెంట్స్‌ చేశారు. అవి చదివాక స్ర్కీన్‌ప్లేలో మెళకువలు నేర్చుకోవాలనుకున్నా. ఇంట్లో ఎంబీఏ చేస్తానని చెప్పి అమెరికా వెళ్లా. కానీ, అక్కడ బోస్టన్‌లో స్ర్కీన్‌పే రైటింగ్‌లో మాస్టర్స్‌ చేశా. అది చేసేటప్పుడు హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘టెడ్‌ 2’తో పాటు కొన్ని ఇండిపెండెంట్‌ చిత్రాలకు పని చేశా. స్ర్కీన్‌ప్లే, సాంకేతిక అంశాలపై పట్టు సాధించా. తిరిగొచ్చాక, ‘ఛలో’ ప్రమోషన్స్‌ టైమ్‌లో నాగశౌర్య పరిచయమయ్యారు. మాకు కామన్‌ ఫ్రెండ్స్‌ ఉండడంతో త్వరగా కలిసిపోయాం.

నాగశౌర్య రెండేళ్లు కష్టపడి ‘అశ్వథ్థామ’ కథ రాశారు. అది విన్నాక ఎంత మనసు పెట్టి రాశారో అర్థమైంది. అన్నయ్య రాసిన కథను టెక్నికల్‌గా ఎంత బాగా తీయాలో... అంత బాగా తీశాం. సమాజంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు, అకృత్యాల నేపథ్యంలో కథ సాగుతుంది. దిశ ఘటన కంటే ముందే కథ రాశాం. అయితే... సినిమాలో దిశ ఘటనను గుర్తుచేసే సన్నివేశాలు ఉంటాయి. జిబ్రాన్‌ నేపథ్య సంగీతం చిత్రాన్ని మరింత ఎఫెక్టివ్‌గా మార్చింది. నాకు క్రిష్‌ దర్శకత్వం వహించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’, డ్రామా చిత్రాలు ఎంతో ఇష్టం. అటువంటి చిత్రాలు తీయాలనుకుంటున్నా.