Sarileru-Nikevvaru-Crosses-1-Miillion-Dollar-Mark-in-US

అమెరికాలో మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిన ‘సరిలేరు నీకెవ్వరు’

ఇంటర్నెట్ డెస్క్: సూపర్‌స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. శనివారం విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో మహేష్ బాబు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వీకెంట్ అవ్వడం, సంక్రాంతి సమయం కావడంతో ఈ చిత్రానికి రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చినట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటిరోజు ఈ చిత్రం రూ. 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక లెక్కలు రావాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో సరిలేరు నీకెవ్వరు కొత్త రికార్డులను సృష్టించినట్టు అర్థమవుతోంది.

ముఖ్యంగా అమెరికాలో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు గత చిత్రాలు అమెరికాలో మంచి వసూళ్లను రాబట్టాయి. సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా ప్రీమియర్స్‌ ద్వారా శుక్రవారం అమెరికాలో 7 లక్షల 63 వేల 269 డాలర్ల(రూ. 5 కోట్ల 41 లక్షల 61 వేలు)ను రాబట్టింది. శనివారం ఉదయానికి అమెరికాలో సరిలేరు నీకెవ్వరు చిత్రం మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిపోయింది. మరోపక్క ఆస్ట్రేలియాలోనూ సరిలేరు నీకెవ్వరు చిత్రం కొత్త రికార్డును నెలకొల్పింది. మషేష్ బాబు గత చిత్రమైన మహర్షి విడుదలైన మొదటి నాలుగు రోజులకు ఆస్ట్రేలియాలో 2 లక్షల 82 వేల 555 డాలర్లు(రూ. 2 కోట్ల 50 వేలు) సాధించగా.. సరిలేరు నీకెవ్వరు మొదటిరోజే 2 లక్షల 37 వేల 264 డాలర్లు(రూ. కోటి 68 లక్షల 36 వేలు) కొల్లగొట్టింది. అదే విధంగా న్యూజిలాండ్‌లోనూ శుక్రవారం 19 వేల 531 డాలర్లు(రూ. 13 లక్షల 85 వేలు) సాధించి సరిలేరు నీకెవ్వరు చిత్రం నాన్ బాహుబలి రికార్డును సృష్టించింది.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే మహేష్ బాబు నటించిన మూడు చిత్రాలు అమెరికాలో టాప్ - 20 అత్యధిక తెలుగు సినిమా కలెక్షన్ల జాబితాలో ఉన్నాయి. భరత్ అనే నేను చిత్రం 3.42 మిలియన్ డాలర్ల(రూ. 24 కోట్ల 26 లక్షల 84 వేలు)తో టాప్ 20 జాబితాలో నాలుగో స్థానం దక్కించుకుంది. అదే విధంగా శ్రీమంతుడు చిత్రం 2.89 మిలియన్ డాలర్ల(రూ. 20 కోట్ల 50 లక్షల 75 వేలు) కలెక్షన్లతో ఆరో స్థానం, 1.89 మిలియన్ డాలర్ల(రూ. 13 కోట్ల 41 లక్షల 15 వేలు) వసూళ్లతో మహర్షి 18వ స్థానాన్ని దక్కించుకున్నాయి. సోమవారానికి ఈ టాప్ - 20 జాబితాలో సరిలేరు నీకెవ్వరు కూడా చేరుతుందని సినిమా దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. మహేష్ బాబు గత చిత్రం మహర్షి అమెరికాలో 2 మిలియన్ క్లబ్‌కు అతి చేరువలో ఆగిపోయింది. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మహేష్ బాబు 3 మిలియన్ క్లబ్‌లో చేరుతాడంటూ మహేష్ బాబు అభిమానులు చెబుతున్నారు. లాంగ్ రన్‌లో ఈ చిత్రం అమెరికా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సాధించడం ఖాయమంటూ ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు.  

కాగా.. అల్లుఅర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న అల వైకుంఠపురములో చిత్రం కూడా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది. కలెక్షన్ల విషయంలో ఈ రెండు చిత్రాల మధ్య క్లాష్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ.. మహేష్ బాబు, అల్లుఅర్జున్ ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచుతాయని ఆశిద్దాం.