Saaho-USA-premieres-from-29th-August

అమెరికాలో సాహో రికార్డ్.. ప్రీమియర్ల అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే..

బాహుబలి లాంటి చరిత్రాత్మక చిత్రం తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ప్రభాస్‌కు జంటగా బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగస్టు 30న విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ రూపంలో సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 500 కోట్లు జరిగినట్టు సమాచారం. తెలుగు, తమిళ, మళయాల వర్షన్‌ డిజిటల్ రైట్స్‌ను భారీగా రూ. 42 కోట్లకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ఇంత మొత్తానికి డిజిటల్ రైట్స్ అమ్ముడుపోవడం ఇప్పటివరకు ఇదే రికార్డ్. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోవడంతో సాహో కోసం బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ హిందీలోనూ క్రేజ్ సంపాదించుకోవడంతో సాహోపై బాలీవుడ్‌లోనూ భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్లలో సాహో మొదటిరోజు టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. ఒక్క బాలీవుడ్‌ మార్కెట్‌లోనే మొదటిరోజు రూ. 25 కోట్ల కలెక్షన్లను సాధిస్తుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. 
 
కాగా, ఓవర్సీస్‌లోనూ అత్యధిక స్క్రీన్లలో సాహోను రిలీజ్ చేస్తున్నారు. సాహో ఓవర్సీస్ రైట్స్‌ను 6 మిలియన్ డాలర్ల(రూ. 42 కోట్లు)కు పార్స్ ఫిలిమ్స్ దక్కించుకుంది. ఈ లెక్కన డిస్ట్రిబ్యూటర్లు ఓవర్సీస్‌లో గట్టెక్కాలంటే కనీసం రూ. 50 కోట్ల షేర్‌ను సాహో చిత్రం సాధించాల్సి ఉంటుంది. ఆగస్ట్ 29న రాత్రి 8.30 ని.లకు ఓవర్సీస్‌లో సాహో ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఇప్పటివరకు ప్రీమియర్ల షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపు 5 లక్షల డాలర్లు(రూ. 3.6 కోట్లు) వచ్చినట్టు సమాచారం. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మొదటిరోజే 2 మిలియన్ మార్క్ దాటే అవకాశమున్నట్టు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.