Saaho-shooting-in-Austria

ఆస్ట్రియాలో షూటింగ్ జరుపుకుంటోన్న ‘సాహో’

‘బాహుబలి’ వంటి గ్రాండ్ సక్సెస్‌ను అందుకున్న తర్వాత యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ ‘సాహో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ భారీ యాక్షన్ సినిమా టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఆస్ట్రియాలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందుకు సంబంధించిన వర్కింగ్ స్టిల్‌ను ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా విడుదల చేశాడు. ‘‘హాయ్ డార్లింగ్స్!! ఆస్ట్రియాలోని ఇన్స్‌బర్క్, టిరోల్‌లో షూటింగ్ చేస్తున్నాం. ఇప్పటివరకూ నాకు కలిగిన గొప్ప అనుభూతి ఇది’’ అంటూ ప్రభాస్ పేర్కొన్నాడు.
 
అయితే సాహో సినిమాని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ సినిమాకు సంబంధించి వెరైటీగా ప్రమోషన్స్ ప్రారంభించింది. ఈ సినిమా మొదటి పాట కోసం అభిమానులు వాట్సాప్ ఛాట్ చేస్తున్నట్లుగా ఓ వీడియోని యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. అంతేకాక.. పాట ఏంటో కనిపెట్టాలని అభిమానులకు సవాల్ విసిరింది. కాగా, ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. నీల్ నితిన్ ముఖేశ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, చంకీ పాండే, మందిరా బేడీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.