Saaho-overseas-theatrical-rights-sold-for-Rs-42-cr

సాహో సినిమాకు కొత్త టార్గెట్.. అదే జరిగితే ప్రభాస్‌కు అరుదైన రికార్డు

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `సాహో`. యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌ వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఆగస్ట్ 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. `బాహుబలి` తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఉన్న అంచనాలు కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఆంధ్ర, తెలంగాణలతో పాటు ఓవర్సీస్‌లోనూ సాహో రైట్స్ భారీగానే పలికినట్టు సమాచారం. 

నైజాం ఏరియాలో రూ.40కోట్లు, సీడెడ్‌లో రూ.25కోట్లు, కృష్ణలో రూ.8కోట్లు, గుంటూరులో రూ.12.50కో్ట్లు, నెల్లూరులో రూ.4.50కోట్లు, వెస్ట్, ఈస్ట్ ఏరియాల్లో రూ.19కోట్లు, ఉత్తరాంధ్ర రూ.16కోట్లు .. మొత్తంగా రెండు తెలుగురాష్ట్రాల్లో రూ.125కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. కర్ణాటకలో రూ.28 కోట్లు, తమిళనాడు, రెస్టాఫ్ ఇండియాలో రూ.18కోట్లు, బాలీవుడ్‌లో రూ.120కోట్లు, ఓవర్ సీస్‌లో 42కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్. అంటే దాదాపు రూ.333కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. మరి వసూళ్ల పరంగా `సాహో` ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

కాగా, ఓవర్సీస్‌లో ఇప్పటివరకు బాహుబలి పార్ట్-1, 2 సినిమాలే అత్యధిక కలెక్షన్లను రాబట్టాయి. బాహుబలి పార్ట్ -1 సినిమాకు అమెరికాలో 7.51 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాగా.. బాహుబలి పార్ట్-2 సినిమాకు 20.77 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక సాహో ఓవర్సీస్ రైట్స్ 6 మిలియన్ డాలర్ల (రూ. 42 కోట్లు)కు అమ్ముడుపోయాయి. అంటే సాహో సినిమాకు నష్టం రాకూడదంటే కనీసం 6 మిలియన్ డాలర్ల కలెక్షన్లను ఓవర్సీస్‌లో రాబట్టాలి. అంతకంటే తక్కువ వస్తే మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలే మిగులుతాయి. అంటే దాదాపుగా బాహుబలి పార్ట్ -1 సినిమాకు ఓవర్సీస్‌లో ఎంత కలెక్షన్లు వచ్చాయో.. అంత మొత్తం సాహో సినిమాకు రావాల్సి ఉంటుంది. మరి ఈ టార్గెట్‌ను సాహో చేరుకోగలదా..?  ఒక వేళ చేరుకుంటే మాత్రం.. ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన మొదటి మూడు సినిమాలు.. ప్రభాస్‌వే అవుతాయి.