Saaho-crosses-2-Million-Dollar-mark-in-the-early-hours-of-Sunday-in-USA

2 మిలియన్ క్లబ్‌లో చేరిన ‘సాహో’.. డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం..

బాహుబలి’ లాంటి చరిత్రాత్మకమైన చిత్రం తరువాత యంగ్ రెబల్‌స్టార్ నటించిన చిత్రం ‘సాహో’. శుక్రవారం నాలుగుభాషల్లో దాదాపు 8500 థియేటర్లలో విడుదలైన సాహో చిత్రానికి డివైడ్‌టాక్‌ వచ్చినప్పటికీ.. కలెక్షన్లలో మాత్రం ఈ చిత్రం దూసుకుపోతోంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 205 కోట్ల గ్రాస్‌ను సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు రూ. 42 కోట్ల షేర్‌ను సాహో సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ సాహో కలెక్షన్ల రూపంలో తన సత్తా చాటుకుంటోంది. ఖాన్‌ల చిత్రాలు మాత్రమే బాలీవుడ్‌లో 100 కోట్ల క్లబ్‌లో చేరుతాయనే మాటలకు రోజులు చెల్లిపోయాయి. ఒక తెలుగు సినిమా కూడా బాలీవుడ్‌లో 100 కోట్ల క్లబ్‌లో చేరగలదని.. ప్రభాస్ బాహుబలితో నిరూపించాడు. తాజాగా విడుదలైన సాహో చిత్రం కూడా సోమవారం 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాహో హిందీ వర్షన్‌కు శుక్రవారం రూ. 24.40 కోట్లు, శనివారం 25.20 కోట్లు, ఆదివారం 29.48 కోట్లు సాధించింది. సోమవారం సెలవు దినం అయినప్పటికీ.. సాహో కేవలం రూ. 14.20 కోట్ల మాత్రమే సాధించింది. దీంతో ఒక్క హిందీ వర్షన్‌లోనే సాహో రూ. 93.28 కోట్ల వసూళ్లను రాబట్టింది. మంగళవారం సాహో చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాహో చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. థియేట్రికల్ రైట్స్‌ను 290 కోట్లకు అమ్ముడుపోయాయి. మంగళవారానికి ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను తెచ్చి పెట్టే అవకాశముంది. లాంగ్‌రన్‌లో మరో రూ. 90 కోట్లు సునాయాసంగా వస్తాయని.. ఇండియన్ డిస్ట్రిబ్యూటర్లు గట్టేక్కేస్తారని సినీ విశ్లేషకులు లెక్కలేసుకుంటున్నారు.       

 
ఓవర్సీస్‌లోనూ సాహో మంచి కలెక్షన్లను రాబడుతోంది. ప్రీమియర్లలో మిలియన్ డాలర్ మార్క్‌ను చేరుకోనప్పటికీ.. లాంగ్‌రన్‌లో మాత్రం సాహో మంచి ఫలితాలను రాబట్టే అవకాశముంది. అయితే సాహో ఓవర్సీస్ రైట్స్‌ను పార్సీ ఫిలిమ్స్ అత్యధికంగా 6 మిలియన్ డాలర్ల(రూ. 43 కోట్ల 12 లక్షలు)కు కొనుగోలుచేశారు. లాంగ్‌రన్‌లో సాహో 6 మిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశాలు లేనట్టే కనిపిస్తోంది. ఆదివారం ఉదయానికి నార్త్ అమెరికాలో ఈ చిత్రం 2 మిలియన్ డాలర్ల(రూ. 14 కోట్ల 36 లక్షలు) క్లబ్‌లో చేరింది. ఈ ఏడాది అమెరికాలో విడుదలైన తెలుగు సినిమాలలో కేవలం ఎఫ్2 చిత్రం మాత్రమే 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. ఆ చిత్రం తరువాత 2 మిలియన్ క్లబ్‌లో సాహో స్థానం సంపాదించింది. అమెరికాలో రోజూవారి కలెక్షన్లను పరిశీలిస్తే.. ప్రీమియర్ల ద్వారా 9 లక్షల 15 వేల 224  డాలర్ల( 6 కోట్ల 57 లక్షల 41 వేల 272 రూపాయలు)తో.. ప్రీమియర్ల ద్వారా అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రాలలో సాహో ఆరో స్థానాన్ని దక్కించుకుంది. ఇక శుక్రవారం 5 లక్షల 45 వేల 146 డాలర్ల(రూ. 3 కోట్ల 91 లక్షల 58 వేలు)తో సాహో మిలియన్ మార్క్‌ను చేధించింది. శుక్రవారానికి సాహో 14 లక్షల 66 వేల 488 డాలర్ల(రూ. 10 కోట్ల 53 లక్షల 39 వేలు)ను రాబట్టింది. శనివారం 338 లొకేషన్స్‌లో 4 లక్షల 98 వేల 541 డాలర్ల(రూ. 3 కోట్ల 58 లక్షల 17 వేలు)ను కొల్లగొట్టి.. 19 లక్షల 66 వేల 48 డాలర్ల(రూ. 14 కోట్ల 12 లక్షల 50 వేలు)తో 2 మిలియన్ డాలర్ల చేరువలో ఆగింది. ఇక ఆదివారం ఉదయానికి సాహో 2 మిలియన్ క్లబ్‌లో చేరింది. ఆదివారం 3 లక్షల 94 వేల 625 డాలర్లు( రూ. 2 కోట్ల 85 లక్షల 49 వేలు) సోమవారం 2 లక్షల 54 వేల 835 డాలర్లు(రూ. కోటి 84లక్షల 36 వేలు) కలెక్షన్లను సాధించించి. మొత్తంగా 26 లక్షల 25 వేల 862 డాలర్ల(రూ. 18 కోట్ల 77 లక్షలు) కలెక్షన్లను కొల్లగొట్టి 3 మిలియన్ క్లబ్‌లో చేరేందుకు సిద్దమైంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు 6 మిలియన్ డాలర్లకు సాహో రైట్స్‌ను కొనుగోలు చేయడంతో.. వారు గట్టెక్కాలంటే 6 మిలియన్ మార్క్‌ను సాహో చేధించాల్సి ఉంటుంది. మరి లాంగ్‌రన్‌లో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లను సాహో చిత్రం ఎంత వరకు ఆదుకుంటుందో వేచి చూడాలి.