Prathiroju-Pandage-concept-based-on-NRIs-says-Allu-Aravind

ఎన్‌ఆర్‌ఐల బాధను చెప్పాం: అల్లు అరవింద్

‘‘తేజ్‌తో మా బ్యానర్‌లో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటున్నాం. ఇప్పటికి కుదిరింది. ‘భలే భలే మగాడివోయ్‌’ తర్వాత మారుతితో చేస్తున్న సినిమా ఇది. సందేశాన్ని సరదాగా చెప్పే నేర్పరితనం మారుతిలో ఉంది. ఎన్‌ఆర్‌ఐల కథ ఇది. ఈ సినిమా చూశాక వారిలో కొందరు ఆనందపడితే, ఇంకొందరు బాధపడతారు. ఇక్కడి వారితో కనెక్ట్‌ కాలేక ఎన్నారైలు ఎలా బాధపడుతున్నారన్నది ఇందులో కీలక అంశం’’ అని అల్లు అరవింద్‌ అన్నారు. సాయి తేజ్‌, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్‌ సమర్పకుడు. బన్నీ వాస్‌ నిర్మాత. శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించిన పాటతో షూటింగ్‌ మొత్తం పూర్తయింది.
 
ఈ సందర్భంగా సాయి తేజ్‌ మాట్లాడుతూ ‘‘కథ వినగానే వదులుకోకూడదు అనిపించింది. మారుతిగారి గత సినిమాల్లో హీరో పాత్రకి అరుదైన వ్యాధులు ఉండేవి. ఇందులో అతి మంచితనమే హీరోకున్న డిజార్డర్‌. ఆరు నుండి అరవై ఏళ్ల వయసు వరకూ అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘సందేశాన్ని వినోదాత్మకంగా చెప్పాం. అన్ని అంశాలు కలగలిసిన ఫుల్‌ మీల్స్‌ ఇది. అరవింద్‌గారి బ్యానర్‌లో ‘విజేత’లాంటి సినిమా అవ్వాలని బాధ్యతగా తీశాం’’ అని మారుతి చెప్పారు. తమన్‌, రాశీఖన్నా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.