Prabhas-Saaho-placed-in-Top-5-collections-report

టాప్-5 జాబితాలోకి సాహో చేరింది కానీ..

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా.. శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా వచ్చిన సాహో సినిమాకు డివైట్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల వర్షం మాత్రం ఆగడం లేదు.. పెద్ద సినిమాలేవీ లేకపోవడం.. విడుదలయిన చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టడం.. సాహోకు అడ్వాంటేజ్‌గా మారాయి. ఇప్పటికే ఈ సినిమా 400 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించినట్లు.. నిర్మాతలే అధికారికంగా ప్రకటించారు.. ఓవర్సీస్‌లో కూడా కలెక్షన్ల విషయంలో ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది... అమెరికాలో సాహో  ఇప్పటికే 3 మిలియన్ల డాలర్ల మార్కును దాటేసింది. 
 
తెలుగులో మూడు మిలియన్ల డాలర్ల మార్కును దాటిన సినిమాలు కేవలం అయిదంటే అయిదు మాత్రమే ఉండటం గమనార్హం. వాటిల్లో ప్రభాస్‌వే మూడు సినిమాలు ఉన్నాయి. బాహుబలి-1, బాహుబలి-2, రంగస్థలం, భరత్ అనే నేను, సాహో.. ఇవే.. ఇప్పటివరకు ఓవర్సీస్‌లో మూడు మిలియన్ డాలర్ల మార్కును దాటిన సినిమాలు.
 

 

1. బాహుబలి-2 (అన్ని భాషల్లో): 2,05,71,695 డాలర్లు (20 మిలియన్ డాలర్లు)

2. బాహుబలి-1 (తెలుగు): 7.51 మిలియన్ డాలర్లు
3. రంగస్థలం (తెలుగు): 35,13,450 డాలర్లు (3.5 మిలియన్ డాలర్లు)
4. భరత్ అనే నేను (తెలుగు): 34,16,451 డాలర్లు (3.4 మిలియన్ డాలర్లు)
5. సాహో (అన్ని భాషల్లో కలిపి): మూడు మిలియన్ డాలర్లు (ఇంకా థియేటర్లలో నడుస్తోంది)
 
నాన్ బాహుబలి రికార్డుల లెక్కల్లోకి వస్తే.. మూడంటే మూడు సినిమాలు మాత్రమే ఓవర్సీస్‌లో మూడు మిలియన్ డాలర్ల మార్కును దాటాయి. రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు నేరుగా తెలుగు భాషలోనే మూడు మిలియన్ డాలర్ల ఫీట్‌ను సాధించాయి. సాహో సినిమా మాత్రం ఈ రెండింటికీ పూర్తి భిన్నం.. అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా ఓవర్సీస్‌లో మూడు మిలియన్ల డాలర్ల మార్కును చేరుకుంది. ఈ సినిమా ఓవర్సీస్‌ హక్కులు 42 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయి. అక్కడి డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టాలంటే సాహో కనీసం 6 మిలియన్ డాలర్ల మార్కును చేరుకోవాలి. అన్ని భాషల్లోనూ కలిపినా.. ఓవర్సీస్‌లో ఈ టార్గెట్‌ను చేరుకోవడం సాహోకు కాస్త కష్టమేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అయినా.. ఓవర్సీస్‌లో మాత్రం గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదని విశ్లేషిస్తున్నారు.