Megastar-Fans-Hungama-at-SYERAA-Premier-in-Kansas-City

కాన్సాస్‌లో 'సైరా' ప్రీమియర్ షో సందర్భంగా మెగా అభిమానుల హంగామా

కాన్సాస్‌: స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌చరిత్ర ఆధారంగా తెర‌కెక్కించిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో నటుడు రామ్‌చ‌ర‌ణ్ భారీ ఖర్చుతో నిర్మించిన ఈ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, నయనతార, తమన్నా హీరోహీరోయిన్లుగా అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క ఇతర కీలక పాత్రల్లో నటించారు. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్‌‌ను సొంతం చేసుకుని‌ మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. 

ఇక అమెరికాలోని కాన్సాస్‌లో 'సైరా'  ప్రీమియర్ షో సందర్భంగా మెగాస్టార్ అభిమానులు హంగామా చేశారు. ప్రీమియర్ షోకు భారీగా తరలి వచ్చిన మెగా అభిమానులు బిగ్‌బాస్ కటౌట్ ముందు థియేటర్‌లోనే కేక్‌ కట్ చేసి సందడి చేశారు. మెగాస్టార్ జిందాబాద్ నినాదాలతో థియేటర్‌ను హోరెత్తించారు. మెగా అభిమానులు చేసిన హంగామాకు సంబంధించిన ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

ఇదిలాఉంటే విదేశాల్లోనూ సైరా చిత్రం రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఓవర్సీస్‌లో మొదటిరోజు ఈ చిత్రం రూ.10 కోట్ల మార్క్‌ను సాధించినట్టు వార్తలొస్తున్నాయి. అమెరికాలో 308 లొకేష‌న్స్‌లో ప్రీమియ‌ర్స్‌ రూపంలో సైరా 8,57,765 డాల‌ర్ల(6.10 కోట్ల రూపాయ‌లు)ను రాబ‌ట్టింది. ప్రభాస్ నటించిన సాహో చిత్రానికి ప్రీమియర్ల ద్వారా 8.2 లక్షల డాలర్ల(రూ. 5 కోట్ల 83 లక్షలు) కలెక్షన్లు రాగా.. సైరా చిత్రం ఆ రికార్డును అధిగమించింది. ఆస్ట్రేలియాలోనూ సైరా చిత్రం ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 39 లొకేష‌న్స్‌లో 1,89,237 ఆస్ట్రేలియ‌న్ డాల‌ర్స్‌(రూ. 90.29 లక్షలు)ను సాధించింది.