Mega-fans-from-Houston-promote-Syeraa-movie

అమెరికాలో మెగా అభిమానుల ‘సైరోత్సవం’..

తెలుగు సినీ ప్రపంచంలో ప్రప్రధమంగా స్వతంత్ర ఉద్యమ నేపధ్యంతో భారీ తారాగణంతో రూపొందించిన మెగా మూవీ "సైరా నరసింహా రెడ్డి". దీన్ని ప్రమోట్ చేయడానికి అమెరికాలోని  టెక్సాస్ రాష్ట్రంలో హ్యూస్టన్ మహానగరంలో మెగా అభిమానులు రవి వర్రె, బద్రుద్దీన్ పిట్టర్ ఆధ్వర్యంలో  గోదావరి రెస్టారెంట్లో ‘సైరా’ మూవీ ప్రమోషన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉయ్యాలవాడ శ్రీనివాసులు హాజరయ్యారు. ఉయ్యాలవాడ శ్రీనివాసులు  ఉయ్యాలవాడ బుద్ధా రెడ్డి మునిమనవడు.  ఉయ్యాలవాడ నరసింహారెడ్డితోపాటు బుద్ధా రెడ్డి( బుద్ధన్న) కూడా బ్రిటీష్ సామ్రాజ్యంపై యుద్ధం చేశారు. 
 
రవి వర్రే మాట్లాడుతూ, మెగా కుటుంబంతో తమ అనుబంధం, భీమవరం కాలేజి రోజుల్లో మెగాస్టార్ సినిమాల సందడి, మెగా టెక్సాస్ సినిమాస్ ఖైదీ నంబర్ 150 సందర్భంగా అమెరికా మొత్తం జరిపిన ప్రమోషన్, హ్యూస్టన్ నుంచి అట్లాంటా వరకు ఖైదీ నంబర్ 150 బస్సు యాత్ర... మొదలగు విషయాలను పంచుకున్నారు. బద్రుద్దీన్ పిట్టర్ మాట్లాడుతూ, ముందుగా ఈ సైరోత్సవాలకి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉయ్యలవాడ నరసింహారెడ్డి గురించి తన చిన్ననాటి నుంచి తెలిసిన విషయాలు వెల్లడించారు. బనగానపల్లె, కోయిలకుంట్ల ప్రాంతాల్లో ఉయ్యలవాడ వారి యుద్ధభూమి విశేషాలు వివరించారు. 
 
ఈ కార్యక్రమానికి అంట్లాంటా నుంచి విచ్చేసిన మెగాఅభిమాని సాగర్ లగిశెట్టి మాట్లాడుతూ, ఆనాటి ఖైది నుంచి నిన్నటి ఖైదీ నంబర్ 150, నేటి సైరా వరకూ మెగాస్టార్ చరిష్మా తగ్గలేదన్నారు. కృష్ణారెడ్డి బయన చారిత్రాత్మకమైన ఈ స్వాతంత్రయోధుడి సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజేష్ యాళ్ళబండి మాట్లాడురూ, "సైరా నరసింహా రెడ్డి" మెగా సినిమా అమెరికాలో యాభై రాష్ట్రాల్లో, అలస్కా, బహామస్, కరీబియన్ దీవులు, లాటిన్ అమెరికా దేశాలలో కూడ విడుదలవుతున్న ప్రప్రధమ సినిమా అని తెలియజేశారు. తెలుగు వాడి వేడి, ధీరత్వం,దేశభక్తిని దక్షిణాదికే పరిమితం చేయకుండా మొత్తం ప్రపంచానికి "సైరా నరసింహా రెడ్డి" సినిమా ద్వారా చాటుతున్నారని కొనియాడారు. 
 
గోపాల్ గూడపాటి మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవిగారితో తన అనుబంధాన్ని, ఖైదీ నంబర్ 150 సినిమాకి హ్యూస్టన్ హంగామా గురించి గుర్తుచేసుకున్నారు. సైరా కూడా  అదే రేంజ్‌లో విజయం సాధించాలని కోరుకున్నారు. అన్నపూర్ణ మాట్లాడుతూ, "సైరా" మరో చరిత్ర సృష్టించాలని కోరారు.  వెంకట్ శీలం "సైరా నరసింహా రెడ్డి" చిత్ర బృందానికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ కుటుంబానికి ఉయ్యాలవాడ శ్రీనివాసులు కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించారు. సైరా సినిమా చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకోవాలని సురేష్ పగడాల అన్నారు.
 
ఈ సైరోత్సవాలకు ప్రధాన అతిధి ఉయ్యాలవాడ శ్రీనివాసులు స్వాతంత్ర సమరంలో తమ కుటుంబం పాలుపంచుకున్న విషయాలను, తమ తాత ముత్తాతల నుంచి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి తమకు తెలిసిన విశేషాలను, స్వాతంత్ర సమరం సందర్భంగా, తదనంతరం తమ కుటుంబం పాత్రను వివరించారు. ఆ మహా యోధుడి వీరమరణాన్ని, ఆయన తలను ముప్పైఏళ్లపాటు కోటకు వేలాడదీసిన విషయాన్ని వివరించారు. స్వతంత్ర సమరయోధులు, వారి కుటుంబాలతో  బ్రిటీష్ వారు ఎంత దారుణంగా వ్యవహరించేవారో పూసగుచ్చినట్లు తెలిపారు. ఉయ్యాలవాడ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్న నిర్మాత రామ్‌చరణ్ తేజకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 
 
సైరోత్సవాలకి సహకరించిన సురేష్ సత్తి, శ్రీనివాస్ కిమిడి, మనోజ్ తోట, నాగు కూనసాని, చైతన్య కూచిపూడి, జై కుమార్ తన్నీరు, మల్లేశ్వర్  ఏనుగు, కళ్యాణ్ ఉప్పు, సుబ్బారావ్, గంగాధర్ మోసూరు, రాం పురం తదితర మెగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.