Maharshi-overseas-collections

ఆ ఫ్లాప్ సినిమా కన్నా మహర్షికి తక్కువ ఓపెనింగ్స్..!

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు మహేశ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేశ్‌బాబు కెరీర్‌లో 25వ చిత్రంగా వచ్చిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీగా విడుదల చేశారు. బాహుబలి-2, భరత్ అనే నేను సినిమాలను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌ చేసిన గ్రేట్ ఇండియన్ ఫిల్మ్స్ మహర్షి ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను 14 కోట్లకు దక్కించుకుంది. అమెరికా వ్యాప్తంగా బుధవారం 2,500 ప్రీమియర్ షోలను వేశారు. 

 
ఇక కలెక్షన్లను గమనిస్తే మహర్షి చిత్రం మహేష్‌బాబు నటించిన స్పైడర్, భరత్‌ అనే నేను చిత్రాల ఓవర్సీస్ ప్రీమియర్ కలెక్షన్లను దాటలేకపోయింది. మొదటిరోజే ఫ్లాప్‌ టాక్‌ను మూటగట్టుకున్న స్పైడర్‌కు అమెరికాలో ప్రీమియర్ల ద్వారా 10 లక్షల 5 వేల 630 డాలర్లు(రూ. 7 కోట్ల 2 లక్షల 91 వేలు) సాధించగా, భరత్ అనే నేను చిత్రానికి ఎనిమిది లక్షల డాలర్ల(రూ. 5 కోట్ల 59 లక్షల 8 వేలు) కలెక్షన్లు వచ్చాయి. ఇక మహర్షి చిత్రానికి వస్తే అమెరికాలో ప్రీమియర్ల ద్వారా మహర్షికి కేవలం ఐదు లక్షల 11 వేల డాలర్లు(రూ. 3 కోట్ల 57 లక్షల 11 వేలు) మాత్రమే వచ్చాయి. యూఎస్‌లో ఆదివారం లోపు ఈ చిత్రం రెండు మిలియన్ డాలర్ల చెంతకు చేరచ్చని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.