Maharshi-Crosses-million-mark-in-USA

మహర్షితో కొత్త రికార్డును సృష్టించిన మహేష్ బాబు

సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన మహర్షి చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుని విజయవంతంగా నడుస్తోంది. మహేష్ కెరీర్‌లో 25వ చిత్రంగా వచ్చిన మహర్షి ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు ఓవర్సీస్‌లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి మూడు రోజులకు గాను మహర్షి చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 39 కోట్ల 89 లక్షల షేర్‌ను కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్‌లో శనివారం ఉదయానికి మహర్షి మిలియన్ మార్క్‌ను అందుకుంది. దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ నిర్మాణంలో భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించగా కథానాయికగా పూజా హెగ్దే తన అందాలను ఆరబోసింది. జగపతిబాబు విలన్‌గా మరోసారి తన విశ్వరూపాన్ని చూపించారు. తన కామెడీతో ఎప్పుడు ప్రేక్షకులను నవ్వించే అల్లరి నరేష్ ఈ చిత్రంలో సీరియస్ క్యారెక్టర్ చేయడం విశేషం. ఈ చిత్రం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిందని చెప్పచ్చు.  

 ఓవర్సీస్ మూడు రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే.. ప్రీమియర్ల రూపంలో 5 లక్షల 11 వేల డాలర్లు(రూ. 3 కోట్ల 57 లక్షల 35 వేలు) రాగా గురువారం లక్షా 74 వేల డాలర్ల(రూ. కోటి 21 లక్షల 68 వేలు) కలెక్షన్లను సాధించింది. ఇక శుక్రవారం 2 లక్షల 31 వేల డాలర్లు(రూ. కోటి 61 లక్షల 54 వేలు) సాధించి మొత్తంగా 9 లక్షల 24 వేల డాలర్ల(రూ. 6 కోట్ల 46 లక్షల 17 వేలు) కలెక్షన్ వర్షాన్ని కురిపించిన మహర్షి శనివారం ఉదయం కలెక్షన్లతో మిలియన్ మార్క్‌ను దాటింది. పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ 25వ చిత్రాలుగా వచ్చిన అజ్ఞాతవాసి, నాన్నకు ప్రేమతో అమెరికాలో రెండు మిలియన్ డాలర్ల మార్క్‌ను సాధించాయి. మరి మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి లాంగ్‌రన్‌లో రెండు మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి. కాగా, మహర్షి సినిమాతో తొమ్మిదో సారి మిలియన్ మార్క్‌ను సాధించి ఏ హీరోకూ లేని రికార్డును మహేష్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు మహేష్ బాబు నటించిన ఎనిమిది సినిమాలు(దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 1 నేనొక్కడినే, ఆగడు, శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, స్పైడర్, భరత్ అనే నేను) మిలియన్ మార్క్‌ను దాటగా.. మహర్షి చిత్రం తాజాగా మిలియన్ మార్క్‌ను సాధించి జాబితాలో తొమ్మిదో స్థానంలో చేరింది. సౌత్ ఇండియాలో మరే హీరోకూ ఈ రికార్డ్ లేనదే చెప్పాలి.