Indians-among-842-OSCAR-invitees

ఆస్కార్‌ అకాడమీలో భారతీయులకు చోటు..

వాషింగ్టన్: అవార్డుల ప్రదానంలో వివక్ష చూపుతున్నారని, అవార్డులు నిర్ణయించే బోర్డులో వైవిధ్యం లేదని పలురకాల విమర్శలు ఎదుర్కోవడం అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్)కు కొత్తేమీకాదు. అయితే ఈ విమర్శలు గతేడాది మరీ ఎక్కువగా వినిపించాయి. శ్వేతజాతీయులకే ఈ అవార్డులు అందజేస్తున్నారని, వీటిని నిర్ణయించేది కూడా శ్వేతజాతీయులేనని సోషల్‌మీడియా వేదికగా పెద్ద దుమారమే చెలరేగింది. ఇలాంటి వదంతులకు ఫుల్‌స్టాప్ పెట్టాలని ఆస్కార్ అకాడమీ నిర్ణయించింది. దీనిలో భాగంగా 59 దేశాలకు చెందిన 842 మందిని ఆస్కార్ అకాడమీకి ఆహ్వానించింది. ఈ ఆహ్వానాన్ని స్వీకరించిన వారందరికీ అకాడమీలో చోటుకల్పిస్తామని ఆస్కార్ ట్విటర్‌లో ప్రకటించింది. వీరిలో భారత్‌కు చెందిన ప్రముఖ హిందీ నటుడు, రచయిత అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారు. ఆయనతోపాటు ప్రముఖ దర్శకురాలు జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్‌లకు కూడా ఈ ఆహ్వానం అందింది. అలాగే భారత సంతతికి చెందిన హాలీవుడ్ నటులు ఆర్చీ పంజాబి, నిషా గనాత్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. హాలీవుడ్ దిగ్గజం టామ్ హోలాండ్, లెటీషియా రైట్, పాపులర్ సింగర్స్ అడెలె, లేడీగాగా, స్టెర్లింగ్ కే బ్రౌన్, విన్‌స్టన్ డ్యూక్ వంటి ఎందరో దిగ్గజాలను ఆస్కార్ అకాడమీ ఈ జాబితాలో చేర్చింది.