Huge-Promotion-Event-of-Mamangam-Movie-in-Sharjah

షార్జాలో ‘మామాంగం’ చిత్ర యూనిట్ ప్రమోషన్స్..

షార్జా: మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి నటిస్తున్న భారీ పీరియాడిక్ డ్రామా ‘మామాంగం’ ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రంలో నటిస్తున్న ప్రధాన నటీనటులు శుక్రవారం షార్జాలో ప్రమోషన్ ఈవెంట్‌‌కు ప్లాన్ చేశారు. షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే మమ్ముట్టితో పాటు ఉన్ని ముకుందన్‌, ప్రాచీ తెహ్లాన్ ఇతర నటీనటులు షార్జా చేరుకున్నారు. ఈ సందర్భంగా మూవీ కొత్త ట్రైలర్, చిత్రంలోని పాటలను విడుదల చేయనున్నారు. అలాగే ఎంపిక చేసిన ఐదు ఫ్యామిలీలను చిత్ర యూనిట్ సభ్యులతో సెల్ఫీ తీసుకునే అవకాశం కల్పించనున్నారు ఈవెంట్ నిర్వాహకులు. మాలీవుడ్ చరిత్రలోనే రూ. 55 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మొదటి చిత్రం మామాంగం. ఈ మూవీని కావ్య ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లో ఎన్నారై వేణు కున్నపిల్లి నిర్మించారు. 

ఇక ఈ చిత్రంలో హీరో మమ్ముట్టి కేరళ సాంప్రదాయ యుద్ధవీరుడిగా కనిపించనున్నారు. 'మమాంగం' అనే పండుగ సందర్భంగా జరిగే వివాదం నేపథ్యంలో ఈ మూవీ రూపుదిద్దుకుంది. 1680 కాలానికి చెందిన ఓ మహావీరుడి కథాంశంతో దర్శకుడు పద్మ కుమార్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. రాజా జామో అనే రాజు అరాచకాలకు వ్యతిరేకంగా సావేర్స్‌ అనే కొందరు వీరులు ఒక జట్టుగా ఏర్పడి చేసిన పోరాటమే ఈ మూవీ. మమ్ముట్టితో పాటు ఉన్ని ముకుందన్‌, సిద్ధిక్‌, మణికుట్టన్‌, కనిక, అను, మోహన్‌ శర్మ, ప్రాచీ తెహ్లాన్‌, మాళవికా మీనన్‌ తదితరులు నటించారు. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతోంది.