Huge-expectations-on-Venky-Mama

ఓవర్సీస్‌లో మరోసారి వెంకీ మాయ చేస్తాడా..?

వెంక‌టేశ్, నాగ చైత‌న్య క్రేజీ కాంబినేషన్‌లో `వెంకీమామ‌` టైటిల్‌తో మల్టీస్టారర్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్ ప్రేక్షకుల్లో అంచాలను మరింత పెంచేసింది. డిసెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇప్పటికే చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. జై లవకుశ చిత్రంతో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిజ జీవితంలోనూ మామా, అల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగ చైతన్య.. సినిమాలోనూ మామా, అల్లుళ్లగా నటించడం విశేషం. మరోపక్క వెంకటేశ్ నటించిన దాదాపు ప్రతి మల్టీస్టారర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో.. వెంకీమామ చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. 

ఇదిలా ఉండగా.. గత సంక్రాంతికి వెంకటేశ్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్2 చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్లను రాబట్టింది. ఒక్క ఓవర్సీస్‌లోనే ఎఫ్2 చిత్రం 2.4 మిలియన్ డాలర్ల(రూ. 17 కోట్ల 18 లక్షలు)ను కొల్లగొట్టింది. మరోపక్క నాగచైతన్య కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క చిత్రం కూడా ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్లను సాధించలేదు. వెంకీమామ చిత్రంతో నాగచైతన్య ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరతాడని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. మరోపక్క వెంకటేశ్ ఈ చిత్రంతో మరో మారు మిలియన్ క్లబ్‌లో స్థానం దక్కించుకుంటాడని దగ్గుబాటి అభిమానులు ధీమాగా ఉన్నారు.