French-director-Jerome-Salle-slams-Saaho-director

సాహోపై ఫ్రెంచ్ డైరెక్టర్ సెటైర్లు.. కాపీ కూడా సరిగ్గా చేయలేదంటూ..

ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా.. తొలి రెండు రోజుల్లోనే రూ.205 కోట్ల వసూళ్లు రాబట్టిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఫ్రెంచ్ దర్శకుడు జెరోం సల్లే మాత్రం ఈ చిత్ర బృందంపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. తన సినిమా ‘లార్గో వించ్‌’ను సాహో బృందం కాపీ కొట్టారని విమర్శించాడు. ఆ సినిమాను ఫ్రీమేక్ చేసిన రెండో సినిమా ఇదని.. మొదటి దానితో పోలిస్తే ఏమాత్రం బాలేదన్నాడు. అంతేగాక.. తెలుగు దర్శకులకు ఓ విజ్ఞప్తి కూడా చేశాడు. ‘‘ఒక వేళ నా సినిమాలను కాపీ చేసినట్లైతే.. కనీసం దాన్ని సక్రమంగా చెయ్యండయ్యా’’ అంటూనే.. ‘‘క్షమించండి. నా ట్వీట్ వ్యంగ్యంగా ఉండొచ్చు.. ఈ విషయంలో నేను నిస్సహాయుడిని’’ అని చురకలేశాడు.

 
జెరోం సల్లే తెరకెక్కించిన లార్గో వించ్ చిత్రాన్ని త్రివిక్రమ్ కాపీ కొట్టి అజ్ఞాతవాసిగా తీశాడని అప్పట్లో టీ సిరీస్ సంస్థ ఆరోపించింది. లార్గో వించ్ రీమేక్ రైట్స్‌ను టీ సిరీస్ కొనుగోలుచేయడంతో.. ఆ కథను కాపీ కొట్టినందుకు దాదాపు 15 కోట్లు చెల్లించాలని టీ-సిరీస్ సంస్థ అజ్ఞాతవాసి చిత్ర నిర్మాతలపై ఫిర్యాదు చేసింది. అజ్ఞాతవాసి టీం టీ-సిరీస్‌కు జరిమానా కూడా చెల్లించినట్టు సమాచారం. లార్గో వించ్ చిత్రాన్ని కాపీ కొట్టి అజ్ఞాతవాసిగా తీస్తే.. ఇప్పుడు అజ్ఞాతవాసి స్టోరీతోనే సాహో తీశారంటూ ప్రస్తుతం జెరోం ఆరోపిస్తున్నారు. తన సినిమాలను కాపీ కొట్టినా.. ఒకటి కూడా హిట్ అవ్వలేదని.. కనీసం కాపీ అయినా సక్రమంగా చేయండంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఈ కామెంట్లపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.