Baahubali-team-will-reunite-in-Londons-Royal-Albert-Hall

మరోమారు కలవబోతున్న బాహుబలి టీం

లండన్: యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, దర్శకధీర ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన రికార్డుల గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. భారతదేశ చిత్ర పరిశ్రమ అంటే బాలీవుడ్ మాత్రమే కాదని టాలీవుడ్ అనేది ఒకటి ఉందని బాహుబలి చిత్రం ప్రపంచానికి గుర్తుచేసింది. బాహుబలి రెండో పార్ట్ బాలీవుడ్‌తో కలిపి దేశవ్యాప్తంగా పలు భాషలలో సృష్టించిన రికార్డులను ఇప్పటివరకు ఏ ఒక్క సినిమా చేధించలేదు. విదేశీ మీడియా సంస్థలు కూడా బాహుబలి చిత్రం గురించి మాట్లాడుకునేలా రాజమౌళి బాహుబలిని చెక్కాడు. 

ఇంతకూ బాహుబలి ప్రస్తావన ఇప్పుడెందుకు వచ్చిందంటే.. ఈ నెల 19న లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో సత్తా చాటిన వారికి గౌరవ సూచకంగా రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తూ రావడం ఆనవాయితీగా మారింది. ఎంటర్‌టైన్మెంట్ రంగంలో భాగంగా ఈ హాల్‌లో బాహుబలి చిత్ర ప్రదర్శన జరగనుంది. చిత్ర ప్రదర్శన అనంతరం సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి లైవ్ కన్సర్ట్ కూడా నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనకు బాహూబలి టీం మొత్తం వెళ్లనుంది. ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి, యం.యం. కీరవాణి, చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కార్యక్రమం అనంతరం బాహుబలి టీం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో కూడా పాల్గొననుంది. కాగా, రాయల్ ఆల్బర్ట్ హాల్‌ను 1871లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన నటీనటులు, క్రీడాకారులు, తదితర రంగాలకు చెందిన ప్రముఖులు ఈ హాల్‌లో ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నారు. చిత్ర ప్రదర్శనలు, ఆర్కెస్ట్రా కార్యక్రమాలు, అవార్డ్ ఫంక్షన్‌లు, స్కూల్ అండ్ కమ్యూనిటీ ఈవెంట్లు ఇలా ఇప్పటివరకు ఈ హాల్‌లో 390కు పైగా కార్యక్రమాలను ప్రదర్శించారు.