Ala-Vaikunthapurramuloo-crosses-1-million-dollars-mark-in-US

మిలియన్ క్లబ్‌లోకి ‘అల.. వైకుంఠపురములో..’

ఇంటర్నెట్ డెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. భారీ అంచనాలతో జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ఫ్లాప్‌తో చాలా గ్యాప్ తీసుకుని అల్లుఅర్జున్ అల.. వైకుంఠపురములో చిత్రంలో నటించాడు. త్రివిక్రమ్, అల్లుఅర్జున్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి వస్తున్న సినిమా కావడంతో అల.. వైకుంఠపురములోపై ముందు నుంచే భారీగా అంచనాలు ఉన్నాయి. దీంతోపాటు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి పాట సూపర్ హిట్‌ కావడం ఈ అంచనాలను మరింత పెంచేశాయి. కుటుంబ సంబంధాల గురించి తనదైన శైలిలో చెప్పే త్రివిక్రమ్‌ ఈ చిత్రంతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కావడంతో.. ఈ సినిమాను చూడటం కోసం తెలుగు ప్రేక్షకులు కుటుంబసమేతంగా థియేటర్లకు క్యూ కడుతున్నారు. 

ఇదిలా ఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటిరోజు భారీగా కలెక్షన్లను సాధించినట్టు ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇటు ఇండియాతో పాటు అటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం దుమ్ముదులుపుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ చిత్రం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. అమెరికాలో ఒక్క సినిమా టికెట్ 20 నుంచి 25 డాలర్ల వరకు ఉంటుంది. అల.. వైకుంఠపురములో చిత్రానికి వచ్చేసరికి ఒక టిక్కెట్ ధర 14 డాలర్లు అంతకంటే తక్కువగానే ఉంది. అయినప్పటికీ ఒక్క ప్రీమియర్స్ రూపంలోనే శనివారం ఈ చిత్రం 8 లక్షల 20 వేల డాలర్ల(రూ. 5 కోట్ల 81 లక్షల 87 వేలు)ను సాధించి ఈ ఏడాది అమెరికాలో అత్యధిక ప్రీమియర్ కలెక్షన్లు కొల్లగొట్టిన చిత్రంగా కొత్త రికార్డును క్రియేట్ చేసింది. అమెరికాలో ఆదివారం ఉదయానికి ఈ చిత్రం మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిపోయింది. ఆదివారం కూడా అమెరికాలో ఈ చిత్రం భారీ కలెక్షన్లనే రాబట్టే అవకాశాలు కనపడుతున్నాయి.
 
కాగా.. అల్లుఅర్జున్‌ గత చిత్రాలైన రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, డీజే చిత్రాలు అమెరికాలో మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించాయి. అల.. వైకుంఠపురములో చిత్రంతో అల్లుఅర్జున్ మిలియన్ డాలర్స్ క్లబ్ చిత్రాల సంఖ్య నాలుగుకు చేరింది. అయితే అల్లుఅర్జున్ గత చిత్రాల్లో ఏ ఒక్కటి అమెరికాలో 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరలేకపోయింది. అల్లుఅర్జున్ చిత్రాల్లో అత్యధికంగా డీజే చిత్రం 1.4 మిలియన్ డాలర్లు సాధించింది. అల.. వైకుంఠపురములో చిత్రంతో అల్లుఅర్జున్ 2 మిలియన్ క్లబ్‌లో చేరడం ఖాయంలా కనిపిస్తోంది. లాంగ్ రన్‌లో ఈ చిత్రం 3 మిలియన్ క్లబ్‌లో చేరినా ఆశ్చరపోనవసరం లేదని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అదే విధంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటివరకు ఐదు చిత్రాలు మిలియన్ డాలర్లను సాధించగా.. ఈ చిత్రంలో ఆ సంఖ్య ఆరుకు చేరింది. త్రివిక్రమ్ గత చిత్రాలైన అరవింద సమేత, అజ్ఞాతవాసి, అఆ చిత్రాలు అమెరికాలో 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరాయి. అల.. వైకుంఠపురములో చిత్రం కూడా 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరినట్టయితే.. వరుసగా నాలుగు చిత్రాలను 2 మిలియన్ క్లబ్‌లోకి చేర్చిన దర్శకుడిగా త్రివిక్రమ్ సరికొత్త చరిత్ర సృష్టిస్తారు.