Ala-Vaikuntapurramuloo-Creates-New-Records-in-US

అమెరికాలో ‘అల.. వైకుంఠపురములో..’ ప్రభంజనం..

  • 2020లో తొలి భారతీయ చిత్రంగా రికార్డ్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో..’ మూవీ తొలి ఆట నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ చిత్రం అంతే భారీ వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. ముచ్చటగా మూడోసారి బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మూవీకి తొలి ఆట నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో భారీగా కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్‌లోనూ ‘అల.. వైకుంఠపురములో..’ తన జోరు చూపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది అమెరికాలో అత్యధిక ప్రీమియర్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అలాగే విడుదలైన తొలిరోజు(ఆదివారం) ఉదయానికే ఈ చిత్రం మిలియన్ డాలర్ల క్లబ్‌లో కూడా చేరిపోయింది.
తాజాగా ఈ సినిమా రెండు మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. శుక్రవారం ఉదయానికి యూఎస్‌లో ‘అల.. వైకుంఠపురములో..’ ఈ మార్క్‌ను అందుకుంది. దీంతో దర్శకుడు త్రివిక్రమ్‌కు వరుసగా రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టిన నాల్గో మూవీగా నిలిచింది. ఇంతకుముందు ఆయన డైరెక్ట్ చేసిన 'అరవింద సమేత', 'అజ్ఞాతవాసి', 'అఆ' చిత్రాలు ఈ క్లబ్‌లో ఉన్నాయి. కాగా, బన్నీకి మాత్రం ఇదే తొలి రెండు మిలియన్ డాలర్ల సినిమా. అంతేగాక యూఎస్‌లో 2020లో ఈ మార్క్‌ను అందుకున్న తొలి భారతీయ చిత్రం కూడా ‘అల.. వైకుంఠపురములో..’ కావడం విశేషం. అలాగే పూర్తి రన్ టైమ్‌లో ఈ సినిమా మూడు మిలియన్ల క్లబ్‌లో చేరడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.