Worlds-largest-aeroplane-takes-first-flight

పుట్‌బాల్ మైదానం కంటే పెద్ద విమానం

వాషింగ్టన్‌: ఆ విమానం గాల్లోకి లేస్తే రెండు విమానాలు పక్కపక్కనే అతి దగ్గర నుంచి వెళుతున్నట్లు.. ఢీకొంటాయేమో అన్నట్లు అనిపిస్తుంది! నిజానికి అది ఒక విమానమే. దానికి రెండు మెయిన్‌ బాడీలు (డ్యూయల్‌ ఫ్యూసులాజ్‌) ఉంటాయి. దాదాపు ఓ ఫుట్‌బాల్‌ మైదానమంత విస్తీర్ణంతో భారీగానూ ఉంటుంది. ఈ మహాద్భుత విమానాన్ని స్ట్రాటోలాంచ్‌ అనే విమానయాన సంస్థ అభివృద్ధి చేసింది. తమ తొలి పరీక్షను కూడా విజయవంతంగా పూర్తిచేసింది. రెక్కల పరంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన విమానం ఇదేనని.. అమెరికన్‌ ఫుట్‌బాల్‌ స్టేడియమంత నిడివిని కలిగివుంటుందని స్ట్రాటోలాంచ్‌ పేర్కొంది. గరిష్ఠంగా గంటకు 302.4 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. విమానం బరువు దాదాపు 227 టన్నులు. ఒక్కో రెక్క 385 ఫీట్ల వెడల్పు, 238 ఫీట్ల పొడవు ఉంటుంది. కచ్చితంగా చెప్పాలంటే ఏ380 విమానం కన్నా ఒకటిన్నర రెట్లు పెద్దదిగా ఉంటుందీ విమానం. ఆరు బోయింగ్‌ 747 ఇంజన్లతో ఇది నడుస్తుంది. ఈ భారీ విమానాన్ని తొలిసారిగా శనివారం కాలిఫోర్నియాలోని మోజివ్‌ ఏయిర్‌ అండ్‌ స్పేస్‌ పోర్టు నుంచి ప్రయోగించారు. సముద్ర మట్టానికి 17వేల ఎత్తులో మోజివ్‌ ఎడారి మీదుగా 2.5 గంటలపాటు ప్రయాణించింది. అంతరిక్షంలోకి రాకెట్లను మోసుకెళ్లి, వదిలిపెట్టేందుకు ఈ విమానాన్ని రూపొందించారు. అక్కడి నుంచి రాకెట్‌ జ్వలించి ఉపగ్రహాలను విడిచిపెడుతుంది.