Women-travels-Kuwait-with-duplicate-visas

నకిలీ వీసాలతో కువైట్‌కు మహిళలు

  •  26 మందిని గుర్తించిన ఇమ్మిగ్రేషన్‌ అధికార్లు
  •  విమానాశ్రయంలో తనిఖీలు.. పోలీసులకు అప్పగింత
  •  మానవతా దృక్పథంతో విడిచిపెట్టాలి
  •  గల్ఫ్‌ సంక్షేమ సంఘం
శంషాబాద్‌: నకిలీ వీసాలతో కువైట్‌కు వెళ్లేందుకు సిద్ధమైన 26 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మహిళలు ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లేందుకు ప్రయాణం కాగా.. వారి వద్ద ఉన్న వీసాలు సరైనవి కావన్న సమాచారం ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు అందింది. దీంతో రెండు రోజులుగా విదేశాలకు ఉపాధి వీసాతో వెళ్తున్న వారిపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ఆ వీసాలు సరైనవి కావని తేలింది. మంగళవారం చేసిన తనిఖీల్లో ముగ్గురు పట్టుబడగా.. బుధవారం 23 మంది పట్టుబడ్డారు. 
దీంతో వీరికి నకిలీ వీసాలు ఎలా వస్తున్నాయి? ఏ ప్రాంతానికి చెందిన ఏజెంట్ల వద్ద వారు ఈ వీసాలు పొందారు? అనే కోణంలో పూర్తిస్థాయిలో చిచారణ జరిపేందుకు ఈ మహిళలను ఆర్జీఐఏ పోలీ్‌సస్టేషన్‌కు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పట్టుబడిన మహిళలపై పోలీసులు కేసులు పెట్టకుండా మానవతా దృక్పథంతో వారిని విడిచిపెట్టాలని గల్ఫ్‌ సంక్షేమ సంఘం ప్రతినిధి బసంత్‌రెడ్డి కోరారు. వారంతా పొట్టకూటి కోసం విదేశాలకు వెళుతున్నారని, ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలని అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఏజెంట్ల చేతిలో ఈ మహిళలు మోసపోయారని, ఆ ఏజెంట్ల ఆచూకీ కనుగొని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.