Woman-Face-Strange-Situation-after-Laughing-Too-Loudly

నవ్వు తెచ్చిన తంటా.. నరకం అనుభవించిన మహిళ..

బిజీంగ్: నవ్వు నాలుగు విధాల చేటు అని అన్నారు పెద్దలు. కానీ నవ్వు నలభై విధాల ఆరోగ్యానికి మంచిదని వైద్యులు అంటున్నారు. మానసిక ప్రశాంతతకు నవ్వు అనేది చాలా అవసరమని వారి వాదన. అలాగే ఎన్నో పెద్ద సమస్యలకు కూడా చిన్న చిరు నవ్వుతో ఫుల్‌స్టాప్ పెట్టొచ్చట. అయితే కొందరు చిన్నగా నవ్వి ఊరుకుంటే.. మరికొందరు నవ్వే నవ్వు ఉంటది చూడండి.. ఓ పగలబడి నవ్వేస్తుంటారు. ఇదిగో ఇలాగే చైనాలో ఓ మహిళ బిగ్గరగా నవ్వి సమస్యను కొనితెచ్చుకుంది. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో పగలబడి నవ్విన ఆ మహిళ దవడ ఎముక జారిపోయింది. దవడ ఎముక పక్కకు జరగడంతో ఆమె నోరు అలాగే తెరుచుకొని ఉండిపోయింది. దీంతో ఇటు నోరు మూయలేక.. అటు మాట్లాడలేక మహిళ కొద్దిసేపు నరకం అనుభవించింది. అయితే అదృష్టవశాత్తు ఆ రైలులోనే లివాన్ ఆసుపత్రికి చెందిన లువో వెన్‌షెంగ్ అనే వైద్యుడు కూడా ఉండడంతో ఆమెకు వెంటనే ప్రథమ చికిత్స అందించాడు. అనంతరం మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయడంతో దవడ ఎముక యధాస్థితికి వచ్చింది. దీంతో మహిళ ఊపిరిపీల్చుకుంది. ఇప్పుడీ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఛలోక్తులు విసురుతున్నారు. 

Related Articles