woman-arrested-for-cheating-NRIs

ఎన్నారైలే టార్గెట్.. అందమైన అమ్మాయిల ఫొటోలు ఆన్‌లైన్‌లో పెట్టి..

 •  అందమైన అమ్మాయిల ఫొటోలు మ్యాట్రిమోని సైట్లలో పోస్ట్‌
 • పెళ్లి చేసుకుంటానంటూ డబ్బు వసూలు
 • మోసపోతున్న యువకులు, వారి తల్లిదండ్రులు
 • నిందితురాలి అరెస్టు.. 10 బ్యాంక్‌ పాస్‌పుస్తకాలు, 16 చెక్కు బుక్‌లు, 34 ఏటీఎం కార్డులు, 2 పాన్‌ కార్డులు, ఏడు ఫోన్లు స్వాధీనం 

హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి): మ్యాట్రిమోని సైట్లలో అందమైన అమ్మాయి ఫొటో చూడగానే పెళ్లికాని యువకులు ఆమెను చేసుకునేందుకు ఆసక్తి చూపుతారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న కొడుకుకు సరైన అమ్మాయి కోసం తల్లిదండ్రులు వెతుకుతారు. దీన్ని ఆసరాగా చేసుకున్న కి‘లేడీ’ అందమైన ఫొటోలు సేకరించి వాటిని మ్యాట్రిమోని సైట్లలో పోస్ట్‌ చేస్తోంది. నమ్మకంగా మాట్లాడుతూ యువకులతోపాటు వారి తల్లిదండ్రుల మనసు దోచుకుంటోంది. పెళ్లి చేసుకునేందుకు ఇష్టమని చెప్పి... వారికి నమ్మకం కలిగిన  తర్వాత పెళ్లి షాపింగ్‌, ఇతర ఖర్చుల పేరుతో అకౌంట్‌లోకి డబ్బు బదిలీ చేయించుకొని ఫోన్‌ స్విచాఫ్‌ చేస్తోంది. ఇప్పటికే పలు యువకులను మోసం చేసింది. పోలీసులకు పట్టుబడి ఐదు నెలల జైలు శిక్ష కూడా అనుభవించింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన పద్ధతి మార్చుకోలేదు. ఇదే తరహాలో మోసాలకు పాల్పడుతుండడంతో సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.  

చదువు ఎంబీఏ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, నెల్లూరు ఇనాంగూడ, ఇంద్రలోక్‌ అవెన్యూలో నివసిస్తున్న కొమరం అర్చన(30) ఎస్వీ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. నెల్లూరు రంగనాయకులుపేట ప్రాంతానికి చెందిన కొమరం దుర్గాప్రవీణ్‌ను పెళ్లి చేసుకుంది. 2016లో లెక్చరర్‌గా పనిచేసింది. సులభంగా డబ్బు సంపాదించాలనుకుంది. మ్యాట్రిమోని సైట్లలో అలియాస్‌ జుటూరి వరప్రసాద్‌ అర్చన, అలియాస్‌ జుటూరి ఇందిరా ప్రియదర్శిని అలియాస్‌ పుస్తాయి పేర్లను ఉపయోగించి నకిలీ ప్రొఫైల్స్‌ సృష్టించింది. బేగంపేట లీలానగర్‌లో వైభవ్‌ లేడీస్‌ హాస్టల్‌లో ఉంటూ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువకులు, వారి తల్లిదండ్రులను టార్గెట్‌గా చేసుకొని మోసాలకు పాల్పడుతోంది. ఫొటోలు చూసి ఆకర్షితులై ఫోన్‌ చేసిన యువకులు, వారి తల్లిదండ్రులతో మంచిగా మాట్లాడుతూ, పెళ్లికి ఓకే చెబుతుంది. పెళ్లి షాపింగ్‌ పేరుతో అందినంత దండుకొని ఫోన్‌ స్విచాఫ్‌ చేస్తుంది. గతంలో ఆమె ఉచ్చులో పడి పలువురు యువకులు, వారి తల్లిదండ్రులు మోసపోయారు. సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో పలు కేసులు నమోదయ్యాయి. చంచల్‌గూడ జైలులో 5 నెలల జైలు శిక్ష అనుభవించి గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైంది.  

 

డబ్బులు ఖాతాలో జమకాగానే ఫోన్‌ స్విచాఫ్‌
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన పద్ధతి మార్చుకోకుండా ఇదే తరహా మోసాలకు తెరలేపింది.  పుస్తాయి పేరుతో అందమైన అమ్మాయి ఫొటోను జతచేసి మ్యాట్రిమోని సైట్‌లో వివరాలు నమోదు చేసింది. తమ కొడుకుకు సరిజోడి అని భావించిన ఓ యువకుడి తల్లిదండ్రులు ఆమెను సంప్రదించారు. తన కుటుంబం చెన్నైలో ఉందని చెప్పిన ఆమె సెల్‌ఫోన్‌లో ఉన్న వాయిస్‌ చేంజ్‌ సాఫ్ట్‌వేర్‌లోని మగగొంతుతో తండ్రి అని, లేడీవాయి్‌సతో తల్లి అంటూ మాట్లాడింది. అమెరికాలో ఉన్న వారి కొడుకుతో మాట్లాడి పెళ్లికి ఓకే చెప్పింది. ఎంగేజ్‌మెంట్‌కు బంగారు ఉంగరం కాదు.. ప్లాటినం కావాలని పట్టుబట్టి తనఖాతాలో రూ. 1.50 లక్షలు జమచేయించుకుంది. తర్వాత ఫోన్‌ స్విచాఫ్‌ చేసింది.  ఆమె చెప్పిన చెన్నై అడ్ర్‌సకు వెళ్లిన వారికి అక్కడ ఆ పేరుగల వారు ఎవరూ లేరని తెలిసింది. తాము మోసపోయామని తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించారు. బ్యాంక్‌ ఖాతా వివరాల ఆధారంగా నిందితురాలిని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఆమె నుంచి 10 బ్యాంక్‌ పాస్‌పుస్తకాలు, 16 చెక్కు బుక్‌లు, 34 ఏటీఎం కార్డులు, 2 పాన్‌ కార్డులు, ఏడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
 • అమ్మాయిల ఫొటోలను గూగుల్‌ ఇమేజె్‌సలో పోల్చిచూడాలి.
 • వారితో డైరెక్ట్‌గా వెబ్‌క్యామ్‌ లేదా వీడియో కాల్‌లో మాట్లాడి, ప్రొఫైల్‌లో ఉన్నది ఆమేనని రుజువు చేసుకోవాలి.
 • ఫారిన్‌ నంబర్‌ల నుంచి ఫోన్‌ చేస్తే, వారు నిజంగా విదేశాల్లో ఉన్నారని నమ్మొద్దు.
 • మ్యాట్రిమోని సైట్లలో పరిచయమైన కొత్తవారికి, కుటుంబ సభ్యుల వివరాలు చెప్పొద్దు.
 • అమ్మాయి చెప్పిన వివరాలు నిజమో కాదో పరిచయస్తుల ద్వారా తెలుసుకోవాలి.
 • పెళ్లికి ముందే ఎలాంటి డబ్బు చెల్లింపులు చేయరాదు.
 • ఎవరైనా మోసం చేస్తే వెంటనే సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సూచించారు.