Wedding-Reception-Surprised-All-While-Bride-went-Solo

పెళ్లి రిసెప్షన్‌కు సోలోగా వచ్చిన వధువు.. ఆశ్చర్యపోయిన అతిథులు..

తిరువనంతపురం: అది పెళ్లి రిసెప్షన్. అతిథులు అందరూ వధు-వరుల రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలా ఎదురుచూస్తున్న వారికి కొద్దిసేపటి తర్వాత ఊహించని షాక్ తగిలింది. వేదికపైకి కేవలం వధువు మాత్రమే దర్శనం ఇవ్వడంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది. ఈ కార్యక్రమానికి వరుడు హాజరు కాకపోవడానికి కారణం అతడు ఇటీవలే చైనా నుంచి రావడమే. దీంతో స్థానిక హెల్త్ అధికారులు వరుడిని ప్రత్యేక పరిశీలనలో ఉంచారు. నెల రోజుల పాటు ఎలాంటి పబ్లిక్ ఫంక్షన్‌లలో పాల్గొనకూడదని ఆదేశించారు. దాంతో ఈ నెల 3వ తేదీన జరగాల్సిన పెళ్లిని వాయిదా కూడా వేశారు. కానీ, అతిథులకు ఆహ్వానం వెళ్లడంతో వారు అదే రోజు కార్యానికి వచ్చేశారు. దీంతో వధు-వరుల కుటుంబ సభ్యులు పెళ్లికి వచ్చిన అతిథులను నిరుత్సాహ పరచకుండా ఉండేందుకు వారికి ఒక చక్కని ఆలోచన వచ్చింది. వరుడిని ఇంట్లోనే ఉంచి.. వధువును మాత్రమే రిసెప్షన్‌కు తీసుకొచ్చారు. అది చూసిన అతిథులు షాకయ్యారు. అనంతరం అసలు విషయం తెలియడంతో వారు అయ్యో పాపం అనుకుంటూ వెళ్లిపోయారు.

వివరాల్లోకి వెళ్తే... కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన యువకుడు చైనాలోని వైవూ అనే నగరంలో అకౌంట్‌టెంట్‌గా పని చేస్తున్నాడు. వైవూ అనే ప్రాంతం కరోనా కేంద్రస్థానంగా పేర్కొంటున్న వూహాన్ నగరానికి 1500 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. యువకుడికి ఫిబ్రవరి 3న పెళ్లి నిశ్చయం కావడంతో జనవరి 19న కొచ్చి విమానాశ్రయం చేరుకున్నాడు. అక్కడి నుంచి తన ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో కరోనా కల్లోలం మొదలైంది. దాంతో కేరళ అధికారులు చైనా నుంచి వచ్చిన రాష్ట్ర పౌరులను 30 రోజుల పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని నిర్భందం విధించారు. అంతేగాక వారిని స్థానిక ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ క్రమంలోనే వైవూ నుంచి వచ్చిన స్థానిక యువకుడికి 3న పెళ్లి నిశ్చయమైన విషయం... ఒక రోజు ముందు అధికారుల దృష్టికి వచ్చింది. దాంతో  అప్రమత్తమైన అధికారులు వెంటనే అతని ఇంటికి వెళ్లారు. పెళ్లి వాయిదా వేసుకోవాలని సూచించారు. దాంతో చేసేదేమిలేక వివాహాన్ని వాయిదా వేశారు.

కానీ, అప్పటికే బంధువులకు, స్నేహితులకు పెళ్లి పత్రికలు వెళ్లిపోయాయి. దాంతో కొంతమంది అతిథులు వారి ఇంటికి కూడా వచ్చేశారు. ఆ సమయంలో వారికి ఏం చేయాలో తోచలేదు. చివరకు వధువును మాత్రమే వేదికపైకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలా వెళ్లిన తర్వాత స్టేజీపైనే అసలు విషయం చెప్పాలనే నిర్ణయానికి వచ్చారు. అనుకున్నట్లుగానే పెళ్లి రిసెప్షన్‌కు కేవలం వధువును మాత్రమే తీసుకెళ్లారు. అనంతరం అసలు విషయం అతిథులకు వివరించారు. ఇక ఇప్పటికే  కేరళలోని త్రిస్సూర్, అల్ఫూఝా, కసర్గాడ్ జిల్లాల్లో ముగ్గురికి కరోనా సోకినట్లు తేలింది. భారత్‌లో మొట్టమొదట కరోనా కేసులు నమోదైనవి కూడా కేరళలోనే. దీంతో అప్రమత్తమైన ఆ రాష్ట్ర సర్కార్ 100 మంది అనుమానితులను ఐసోలేషన్ వార్డ్స్‌లో ఉంచారు. అలాగే 2,321 మందిని వారి ఇళ్ల వద్దనే అధికారుల పరిశీలనలో ఉంచడం జరిగింది.