water-may-will-come-from-America-with-in-10-years-which-is-costly-than-Iphone

పదేళ్లలో అమెరికా నుంచి నీరు!

ఐఫోన్‌ కంటే ఎక్కువ చెల్లించాల్సి రావొచ్చు..

భారత్‌ దుస్థితి చూస్తుంటే జాలేస్తోంది
వాటర్‌ రీసైక్లింగ్‌లో సహకారానికి సిద్ధం
షికాగో మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ ఫ్రాంక్‌ ఆవిల
హెచ్‌ఐసీసీలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మనం తాగే నీరు సురక్షితంగా కాదా? ప్రస్తుతం భారత్‌లో దొరికే నీరు తాగితే రోగాల బారిన పడడం ఖాయమా? అంటే అవుననే అంటున్నారు అమెరికాలోని గ్రేటర్‌ షికాగో మెట్రోపాలిటన్‌ వాటర్‌ రీక్లేమేషన్‌ కమిషనర్‌ ఫ్రాంక్‌ ఆవిల. ‘తెలంగాణాతోపాటు ఇతర రాష్ట్రాలు నీటి కాలుష్యంలో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. వీటిపై తక్షణం దృష్టి సారించకుంటే పదేళ్లలో భారత్‌లో స్వచ్ఛమైన నీరే దొరకదు. అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది’ అని ఫ్రాంక్‌ ఆవిల అన్నారు. పదేళ్లలో భారత్‌లో ఐఫోన్‌ అందరికీ అందుబాటులోకి వచ్చినా.. స్వచ్ఛమైన తాగునీరు మాత్రం లభించదన్నారు. తెలంగాణాతో పాటు భారత్‌లోని మొత్తం నీటి వనరుల్లో 70 శాతం అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయన్నారు.
 
ఈ నీటిని కొన్ని వారాలపాటు తాగినా.. దీర్ఘకాలిక రోగాల బారిన పడతారని పేర్కొన్నారు. భారత్‌లో ఇలాంటి ఘోర పరిస్థితి చూస్తుంటే జాలేస్తోందన్నారు. ప్రస్తుతం భారత్‌ లాంటి పరిస్థితి 70 సంవత్సరాల క్రితం షికాగోలోనూ ఉండేదని, ఈ సమస్యలను అధిగమించేందుకు తమకు 50 ఏళ్లు పట్టిందన్నారు. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా), ఎన్‌ఐఆర్డీ పీఆర్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘నీరు, వ్యర్థాల నిర్వహణ’ అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు మంగళవారం హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది. సదస్సుకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఫ్రాంక్‌ ఆవిల మాట్లాడుతూ.. అమెరికాలోని ప్రతి గ్రామంలో స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉందని, నీటి వనరుల కలుషితం పెద్ద నేరంగా పరిగణిస్తారని అన్నారు. ప్రతి గ్రామంలో వాటర్‌ రీసైక్లింగ్‌ ప్లాంట్స్‌ ఏర్పాటు తప్పనిసరి కావడంతో వందశాతం నీటి పునర్వినియోగం జరుగుతుందన్నారు. నీటి పునర్వినియోగానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే పూర్తి సాంకేతిక సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా నీటి పునర్వినియోగం అత్యవసరమన్నారు.
 
మిషన్‌ భగీరథ అనవసరం
ఉన్న నీటిని వృథా చేయకుండా పునర్వినియోగం చేస్తే.. నీటిపై ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. హైదరాబాద్‌లో ప్రతిరోజు 1800 మిలియన్‌ లీటర్ల నీటిని (ఎంఎల్‌డీ) వినియోగిస్తున్నారు. ఇందులో కేవలం 750 ఎంఎల్‌డీ నీరు మాత్రమే పునర్వినియోగం అవుతుంది. మిగిలిన నీరు వృథాగా మురికి కాలువల్లోకి వెళ్తోంది. దీనిని వినియోగించుకోగలిగితే వ్యవసాయానికి కొరత లేకుండా చేయొచ్చు. మిషన్‌ భగీరథ లాంటి భారీ పథకాల అవసరం కూడా ఉండదు.
- శ్యాం పప్పు, సదస్సు కన్వీనర్‌, షికాగో
 
గ్రామాల్లో రీసైక్లింగ్‌ వాటర్‌ ప్లాంట్లు
ఇంతవరకు ఆటలు, సాంస్కృతిక రంగాలపైనే ఎక్కువగా దృష్టి సారించాం. నీరు, వ్యర్థాల పునర్వినియోగం తెలంగాణకు అత్యవసరం. దీనిపై ఇక నుంచి ఆటా ప్రధానంగా దృష్టి సారిస్తుంది. గ్రామాల్లో రీసైక్లింగ్‌ వాటర్‌ ప్లాంట్లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ముందుకొచ్చే ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలకు పూర్తి సాంకేతిక సహకారం అందిస్తాం. ఐటీలో తెలంగాణ వాసులు ప్రపంచంలో పేరు సాధిస్తున్నా.. నీటి పునర్వినియోగంలో వెనుకంజలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
- భువనేశ్‌ బూజల, ఆటా అధ్యక్షుడు