US-House-passes-bill-removing-cap-on-issuing-green-cards

కంట్రీ క్యాప్ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం.. భారతీయులకు ఊరట

వాషింగ్టన్: గ్రీన్ కార్డుల జారీలో కంట్రీ క్యాప్‌ను తీసేస్తూ రూపొందించిన గ్రీన్ కార్డ్ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అమలవుతున్న ఏడు శాతం కంట్రీ క్యాప్ 15 శాతానికి పెంచేలా తాజా బిల్లు ప్రతిపాదించింది. కాంగ్రెస్‌లోని 435 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో 365 మంది మద్దతు లభించడంతో ఈ బిల్లుకు సునాయాసంగా ఆమోదం లభించింది.  దీంతో భారతీయులకు ఊరట లభించింది. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసే వారిలో చైనా, ఇండియా దేశస్థులే ఎక్కువగా ఉండటంతో ఈ బిల్లు ఆమోదంతో వీళ్లు ఎక్కువగా ప్రయోజనం పొందనున్నారు. ప్రస్తుతం ఉద్యోగ ఆధారిత విధానం కింద అమెరికా ప్రతి ఏడాది 1.4 లక్షల గ్రీన్‌కార్డులను జారీ చేస్తోంది. ఇప్పటివరకు వివిధ దేశాలతో, వాటి జనాభాతో సంబంధం లేకుండా ఏ దేశానికైనా 7 శాతం మాత్రమే గ్రీన్ కార్డులను అమెరికా జారీ చేసేది. ఈ కారణం చేత భారతీయులు లక్షల్లో గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేసుకున్నా పది వేల గ్రీన్‌కార్డులకు మించి మంజూరయ్యేవి కావు.

ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందడంతో ఏళ్ల తరబడి గ్రీన్ కార్డు కోసం వేచిచూస్తున్న భారతీయులకు భారీగా ప్రయోజనాలు కలగనున్నాయి. అమెరికాలో హెచ్1-బీ వీసాతో పనిచేస్తూ గ్రీన్ కార్డు కోసం వేచి చూసే వారిలో భారతీయులే ఎక్కువ. ఈ బిల్లు ఆమోదంతో రానున్న పదేళ్లు భారతీయులకే ఎక్కువగా మేలు జరుగుతుందని అంచనా. ప్రస్తుతం అమలవుతున్న చట్టం కింద భారతీయుల దరఖాస్తులన్నీ ఆమోదం పొందాలంటే కనీసం 70 ఏళ్లు పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం ఆమోదం పొందిన బిల్లు చట్టంగా మారాలంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ బిల్లుపై సంతకం చేయాల్సి ఉంటుంది. చైనా, భారత్ దేశస్థుల నుంచి దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని.. భారత సంతతికి చెందిన సెనెటర్ కమలా హ్యారిస్ ఫిబ్రవరిలో ఇలాంటి బిల్లునే అమెరికా సెనెట్‌లో ప్రవేశపెట్టారు. ఆ బిల్లు కూడా త్వరలోనే సెనేట్‌కు రానుంది.