US-Congressman-apologizes-for-not-consulting-Indian-Americans

అగ్రరాజ్యంలోని ఎన్నారైలకు సారీ చెప్పిన అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు..

వాషింగ్టన్: కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని భారత్ రద్దు చేయడంపై వివాదాస్పద లేఖ రాసిన అమెరికా కాంగ్రెస్ సభ్యుడు థామస్ సౌజి క్షమాపణలు చెప్పారు. తన నియోజకవర్గంలోని భారత సంతతి వారితో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. వారి అభిప్రాయాలను కనుక్కున్నారు. ‘భారతసంతతికి చెందిన నా మిత్రులను, మద్దతుదారులను సంప్రదించకుండా ఆ లేఖ రాయడం పొరబాటు. దీనికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను’ అని ఆయన ఈ ప్రాంతంలోని భారతీయులకు చెప్పారు. భారత్-అమెరికా సంబంధాలు భవిష్యత్తుకు ఎంతో అవసరమని, ఈ బంధాలను బలోపేతం చేయడానికి ఎల్లప్పుడూ తాను ప్రయత్నిస్తుంటానని అన్నారు. కశ్మీర్‌లో తలెత్తే సమస్యలను పరిష్కరించడంలో భారత్‌కు అమెరికా చేయగలిగిన సాయం తప్పకుండా చేస్తుందని, దీని కోసం తాను కూడా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.