US-Congress-Passes-Green-Card-bill

భారతీయులకు గుడ్ న్యూస్.. గ్రీన్‌కార్డులపై పరిమితి ఎత్తివేత బిల్లుకు అమెరికా ఆమోదం

డాలర్‌ కలలకు ‘పచ్చ’ జెండా

న్యూయార్క్‌, జూలై 11: డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. భారతీయులకు నష్టం కలిగించే నిర్ణయాలనే తీసుకుంటూ వచ్చిన అమెరికా ప్రభుత్వం, తొలిసారి భారతీయులకు మేలు చేసే దిశగా ఒక అడుగు ముందుకు వేసింది. అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతించే వలసదారుల వీసాలపై (ఇమ్మిగ్రెంట్‌ వీసా) దేశాలవారీగా ఉన్న పరిమితిని ఎత్తివేసే ‘ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హై స్కిల్డ్‌ ఇమ్మిగ్రెంట్స్‌ యాక్ట్‌ ఆఫ్‌ 2019’ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. ఫలితంగా.. భారతీయులకు ఇకపై గ్రీన్‌కార్డులు ఎక్కువగా జారీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న విధానంలో.. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్న సామెత చందంగా అన్ని దేశాలకూ 7శాతం గ్రీన్‌కార్డులు అనే పరిమితి ఉండేది. దీనివల్ల విదేశీయులు గ్రీన్‌కార్డు పొందడం కోసం దశాబ్దాల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడా పరిమితిని తీసివేయడంతో.. భారత్‌, చైనా వంటి దేశాల నుంచి ఎక్కువ సంఖ్యలో తరలివచ్చే వృత్తినిపుణులకు త్వరగా గ్రీన్‌కార్డు రావడానికి మార్గం సుగమమవుతుంది. అంతేకాదు.. కుటుంబ ఆధారిత వలసదారు వీసాల పరిమితిని పెంచే ప్రతిపాదన కూడా ఈ బిల్లులో ఉంది.

ఇదీ నేపథ్యం..

అమెరికా వెళ్లాలనుకునేవారికి ఆ దేశం రెండు రకాల వీసాలు జారీ చేస్తుంది. వృత్తి, ఉద్యోగ రీత్యా, పర్యటనల కోసం, అక్కడ ఉన్న కుటుంబసభ్యులను చూసి రావడం కోసం ఇచ్చేవన్నీ నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసాలు. ఈ వీసాలకు కాలపరిమితి ఉంటుంది. మనందరికీ బాగా చిరపరిచితమైన హెచ్‌1బీ వంటివి ఈ కోవలోకే వస్తాయి. ఇక, రెండో రకం.. ఇమ్మిగ్రెంట్‌ వీసాలు. అంటే వలసదారు వీసాలు. అమెరికాలో శాశ్వతనివాసానికి వీలు కల్పించే వీసా ఇది. ఈ తరహా వీసాలు ఏడాదికి ఒక్కో దేశానికి 7 శాతానికి మించి ఇవ్వకూడదనే నిబంధన ఉంది. ‘ఫెయిర్‌నెస్‌ ఆఫ్‌ హై-స్కిల్డ్‌ ఇమ్మిగ్రెంట్స్‌ యాక్ట్‌, 2019’ పేరుతో.. ప్రతినిధుల సభకు చెందిన జో లోఫ్‌గ్రెన్‌ (డెమొక్రాట్‌, కాలిఫోర్నియా), కెన్‌ బక్‌ (రిపబ్లికన్‌, అయోవా) ఈ బిల్లును 2019, ఫిబ్రవరి 7న ప్రతిపాదించారు. బుధవారం ఓటింగ్‌ జరగ్గా 435 మంది సభ్యుల్లో 365 మంది దీన్ని ఆమోదించారు. 65 మంది వ్యతిరేకించారు.
 
బిల్లులో ఏముంది..
అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించిన బిల్లులో ప్రధానమైన అంశాలేమిటంటే..
ఒక్కో దేశానికీ ఏటా ఇచ్చే కుటుంబ ఆధారిత గ్రీన్‌కార్డులపై ఉన్న పరిమితి 7 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని ప్రతి పాదించారు. అంటే ఎనిమిది శాతం పెరుగుదల. కుటుంబ ఆధారిత గ్రీన్‌కార్డు అంటే.. ఇప్పటికే అమెరికాలో శాశ్వత నివాసం పొందినవారు వేరే దేశంలో ఉన్న తన కుటుంబసభ్యులకు (తల్లి/తండ్రి/భార్య/పిల్లలు) శాశ్వత నివాసం కోసం చేసుకునే దరఖాస్తుల ఆధారంగా ఇచ్చే గ్రీన్‌కార్డు. వీటి సంఖ్య పెరగడం కూడా భారతీయులకు కలిసొచ్చేదే.
 
ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రెంట్‌ వీసాలపై ఉన్న పరిమితిని ఎత్తివేయడం. ఇది కూడా భారత్‌, చైనా, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాలవారికి ఎక్కువగా కలిసొస్తుంది. గ్రీన్‌కార్డుల జారీపై పరిమితిని ఎత్తివేయడం వల్ల ఈ మూడు దేశాలవారికీ ఉపయోగమే. కానీ.. ఏటా ఉండే 7 శాతం పరిమితినే పూర్తిగా చేరుకోని దేశాలకు చెందిన, ఇప్పటికే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న నిపుణులైన ఉద్యోగులకు దీనివల్ల నష్టం కలిగే ప్రమాదం ఉంది. అందుకే 2020 నుంచి 2022 దాకా సమయాన్ని సంధికాలంగా పరిగణించి.. ఈబీ-2 (అత్యంత అసాధారణ సామర్థ్యం ఉన్న ఉద్యోగులకు ఇచ్చే వీసా), ఈబీ-3 (నిపుణులైన పనివారికి ఇచ్చే వీసా), ఈబీ-5 (పెట్టుబడిదారులకు ఇచ్చే వీసా) కేటగిరీలకు చెందిన వారికి ఈ మూడేళ్లపాటు నిర్ణీత శాతం ఉద్యోగ వీసాలను రిజర్వు చేసేలా బిల్లు ప్రతిపాదించింది. గ్రీన్‌కార్డుల జారీలో దేశాలవారీ పరిమితిని అయితే ఎత్తేస్తూ ప్రతిపాదన చేశారుగానీ.. అమలులో, అన్ని గ్రీన్‌కార్డులూ ఒకే దేశానికి పోకుండా జాగ్రత్త పడ్డారు. అన్‌రిజర్వుడు వీసాల్లో 85 శాతానికి మించి వీసాలు ఒకే దేశానికి చెందినవారికి కేటాయించకూడదనే షరతు పెట్టారు.
 
మోదం.. అభ్యంతరం
హెచ్‌ఆర్‌1044 బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం పట్ల అమెరికావ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలోని అగ్రస్థాయి ఐటీ కంపెనీలు కూడా దీన్ని స్వాగతించాయి. సెనెట్‌ కూడా దీనికి వీలైనంత త్వరలోనే ఆమోదం తెలపాలని కోరాయి. ప్రతిభ గలవారికి న్యాయం చేసే విషయంలో సెనెట్‌ కియ్రాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ అభిప్రాయపడింది. కాగా.. అమెరికా అంతర్గత భద్రత విభాగం మాత్రం ఈ బిల్లును తాము సమర్థించబోమని పేర్కొనడం గమనార్హం.
 
సెనేట్‌ కూడా ఆమోదించాలి
భారత్‌, చైనా వంటి దేశాలకు మేలు కలిగించే బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించిందని సంబరపడిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఇది చట్టంగా మారాలంటే దీనికి సెనెట్‌ ఆమోదం కూడా కావాలి (అక్కడ రిపబ్లికన్ల బలం ఎక్కువ). ఆ తర్వాత, దానిపై అధ్యక్షుడు ట్రంప్‌ సంతకం పెట్టాలి. 2011లో కూడా అమెరికా ప్రతినిధుల సభ ఇలాంటి బిల్లును ఆమోదించింది. కానీ సెనెట్‌ నిష్ర్కియగా ఉండిపోవడంతో అది చట్టరూపం దాల్చలేదు. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదనే ఆశిద్దామని ఆశావహులు అంటున్నారు. ఎందుకంటే.. భారత సంతతికి చెందిన కమలాహ్యారిస్‌, ఆమెతోపాటు మైక్‌ లీ అనే మరో సెనెటర్‌ ప్రతిపాదించిన ఎస్‌386 బిల్లు త్వరలోనే సెనెట్‌ ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాగా.. ‘‘ప్రతిభ ఆధారంగా, చట్టబద్ధమైన వలసల విషయంలో ట్రంప్‌ నిజంగానే సీరియ్‌సగా ఉంటే ఆయన ఈ బిల్లు చట్టరూపం దాల్చడానికి మాకు సహాయం చేయాలి’’ అని ప్రతినిధుల సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన జో లోఫ్‌గ్రెన్‌ అన్నారు.