UK-New-Visa-Offer-to-Benefit-Thousands-of-Indian-Students

యూకే ప్రభుత్వం అనూహ్య నిర్ణయం.. భారత విద్యార్థులకు మేలు..

లండన్: యూకేలోని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. 2012లో రద్దు చేసిన రెండేళ్ల పోస్ట్-స్టడీ వర్క్ వీసాను తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో చదువుతో పాటు ఖాళీ సమయాల్లో ఉద్యోగాలు చేసుకునే విదేశీ విద్యార్థులకు ఎంతో మేలు జరుగనుంది. ముఖ్యంగా భారత విద్యార్థులు ఎంతో లాభపడనున్నారు. ఇక తాజాగా నిర్ణయంతో 2020-21 విద్యా సంవత్సరంలో యూకే విద్యా సంస్థల్లో ఇండియాతో పాటు ఇతర దేశాల విద్యార్థుల చేరికలు భారీగా పెరగడం ఖాయమని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని థెరిసా మే హోం సెక్రటరీగా ఉన్నప్పుడు 2012 ఏప్రిల్‌లో బోగస్ యూనివర్సిటీలు ఇష్టానుసారంగా విదేశీ విద్యార్థులను చేర్చుకొని మోసాలకు పాల్పడుతుండడంతో వాటిని ఆరికట్టేందుకు ఈ వీసా విధానానికి ఆమె ముగింపు పలికారు. అప్పటి నుంచి యూకేకు వెళ్లే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా భారత్ నుంచి యూకే వెళ్లే విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. 2010-11లో 39,090గా ఉన్న ఇండియన్ విద్యార్థుల సంఖ్య ఈ వీసా రద్దు నిర్ణయంతో 2016-17కు వచ్చేసరికి 16,550కి తగ్గిపోయింది. అయితే 2019 మార్చి నాటికి కొంచెం మెరుగుపడి 21,165గా ఉంది. ఏడేళ్ల తరువాత పోస్ట్-స్టడీ వర్క్ వీసా విధానాన్ని యూకే ప్రభుత్వం తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో భారత విద్యార్థులతో పాటు ఇతర దేశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

Related Articles