UK-Bus-Awards-for-Two-Indian-Origin-Drivers

ఇద్దరు భారత సంతతి డ్రైవర్లకు 'యూకే బస్ అవార్డ్స్‌'

లండన్: టాప్ నేషనల్ బస్ డ్రైవర్లకు అందించే 'యూకే బస్ అవార్డ్స్‌'కు ఇద్దరు భారత సంతతి డ్రైవర్లు ఎంపికయ్యారు. స్వీడన్ నగరంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న గుర్నామ్ సింగ్, నాటింగ్‌హామ్‌లో పనిచేసే జతిందర్ కుమార్ ఈ పురస్కారాలకు ఎంపియ్యారు. వచ్చే మంగళవారం లండన్‌లో వీరిద్దరూ అవార్డు అందుకోనున్నారు. జతిందర్ కుమార్ మాట్లాడుతూ నాటింగ్‌హామ్‌ సిటీ ట్రాన్స్‌పోర్ట్(ఎన్‌సీటీ)లో 2008 నుంచి పనిచేస్తున్నట్లు తెలిపాడు. పంజాబ్ రాష్ట్రం హోషియార్పూర్ సమీపంలోని నంద చౌర్ గ్రామానికి చెందిన కుమార్ తనకు వచ్చే సాలరీతో ఇండియాలో ఉంటున్న తన ఇద్దరు సోదరిమణులను చదివించానన్నాడు.

తాను సమయానికి వారికి ఆర్థికంగా సహయం చేయడంతో ప్రస్తుతం ఒక సోదరి టీచర్ ఉద్యోగం చేస్తుంటే, మరో సోదరి సొంతంగా బ్యూటీపార్లర్ నడుపుతూ వారి కాళ్లపై వారు నిలబడ్డారని పేర్కొన్నాడు. గత దశాబ్ద కాలంగా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కుమార్ డ్రైవర్‌గా చేసిన సేవలకు గాను అతనికి ఈ పురస్కారం దక్కడం పట్ల ఎన్‌సీటీ హర్షం వ్యక్తం చేసింది. ఇక స్టేజ్‌కోచ్ బస్సు సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్న గుర్నామ్ సింగ్ ఈ ఏడాది కస్టమర్ సర్వీస్ డ్రైవర్‌గా ఎంపికయ్యాడు. కాగా, ఇంతకుముందు 'బస్ ఇండస్ట్రీ అవార్డ్స్‌'గా ఉన్న ఈ పురస్కారాలను 2005 నుంచి 'యూకే బస్ అవార్డ్స్‌'గా మార్చడం జరిగింది. యూకేలో ప్రజా రవాణా పరిశ్రమను ప్రోత్సహించడానికి స్వతంత్ర సంస్థ అయిన బస్ ఇండస్ట్రీ అవార్డ్స్ లిమిటెడ్ ఈ పురస్కారాలను ప్రవేశపెట్టింది.