UK-airline-fines-woman-Rs-70-lakh-for-causing-hijack-scare-on-Turkey-bound-flight-bans-her-for-life

ఈమె చేసిన పనికి.. జీవితాంతం విమానం ఎక్కకుండా ఉండేలా..

లండన్: విమానం కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతోపాటు సిబ్బందిపై దాడిచేసిన 25 ఏళ్ల యువతికి విమానయాన సంస్థ భారీ షాకిచ్చింది. జీవితాంతం ఆమె విమానమెక్కకుండా నో-ప్లయింగ్ జాబితాలో ఆమె పేరును చేర్చింది. అంతేకాదు, రూ.72.36 లక్షల జరిమానాను కూడా విధించింది.. వివరాల్లోకి వెళ్తే.. క్లో హెయిన్స్ అనే యువతి వీల్‌చైర్‌లో ఉన్న తన నానమ్మతో కలిసి ఈ నెల 22న యూకే నుంచి టర్కీ వెళ్లేందుకు జెట్2 విమానమెక్కింది. విమానం గాల్లో ఉండగా అకస్మాత్తుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరిచేందుకు ప్రయత్నించింది. కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. అడ్డుకున్న విమాన సిబ్బందిపై దాడిచేసింది. ఆమె అసాధారణ ప్రవర్తనతో విస్తుపోయిన పైలట్ ఏటీసీకి సమాచారం అందించాడు. దీంతో వెంటనే రాయల్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైటర్ జెట్లు విమానాన్ని చేరుకుని దానిని వెనక్కి తెప్పించాయి.
 
విమానంలో హెయిన్స్ ప్రవర్తన అసాధారణంగా ఉందని జెట్2 సంస్థ సీఈవో స్టీవ్ హీపీ పేర్కొన్నారు. ఆమె తన ప్రవర్తనకు తీవ్రమైన చర్యలు ఎదుర్కోక తప్పదన్నారు. విమానాన్ని వెనక్కి మళ్లించినందుకు అయిన నష్టాన్ని కూడా ఆమె చెల్లించాల్సి ఉంటుందన్నారు. హెయిన్స్ విమాన సిబ్బందిపై అరుస్తూ దాడి చేసి పిడిగుద్దులు కురిపించిందని 58 ఏళ్ల సహ ప్రయాణికుడు ఒకరు తెలిపారు. తనను వదిలిపెట్టకుంటే అందరినీ చంపేస్తానని ఆమె తీవ్ర స్వరంతో హెచ్చరించిందని తెలిపారు.