Two-Women-from-Nizamabad-Trafficked-to-Muscat

బ్యూటీషియన్లుగా ఉద్యోగాలని చెప్పి.. ఇద్దరు తెలంగాణ మహిళలను మస్కట్ తీసుకెళ్లిన ఏజెంట్.. చివరకు

నిజామాబాద్: బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లిన తెలంగాణకు చెందిన ఇద్దరు మహిళలు ఏజెంట్ చేతిలో మోసపోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. బ్యూటీషియన్స్‌గా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లిన ఏజెంట్ తీరా అక్కడికెళ్లిన తరువాత ఇండ్లలో పనికి కుదిర్చాడు. ఆ పని చేయలేక తన ఇద్దరు కూతుళ్లు కష్టాలు పడుతున్నారని, తిరిగి వారిని స్వదేశానికి రప్పించేందుకు సహకరించాలని తల్లి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌‌కు విజ్ఞప్తి చేసింది. 

వివరాల్లోకి వెళితే... తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన అజ్మెర బేగం ఇద్దరు కూతుళ్లు షాహీన్ బేగం(31), అస్మా బేగం(26)లను వారి భర్తలు సరిగ్గా పట్టించుకోకపోవడంతో తమ కాళ్లపై తాము నిలబడాలని ఓ ఎజెంట్ ద్వారా మస్కల్ వెళ్లారు. ఇద్దరికి బ్యూటీషియన్లుగా ఉద్యోగాలు కల్పిస్తానని ఏజెంట్ వారిని మస్కట్ తీసుకెళ్లాడు. ఇద్దరు ఒకే దగ్గర ఉండొచ్చని, ఇరువురికి చెరో రూ. 25వేల జీతం ఉంటుందని నమ్మబలికాడు. ఎజెంట్ మాటలు నమ్మిన వారిద్దరూ మస్కట్ వెళ్లారు. మొదట జూలై 9న షాహీన్ బేగం వెళ్తే, ఆగస్టు 25న అస్మా బేగం మస్కట్ చేరుకుంది. అక్కడికెళ్లిన తరువాత అక్కచెల్లెళ్ళు ఇద్దరు ఏజెంట్ చెప్పిన మస్కట్‌లోని ఓ నియామక సంస్థను సంప్రదించారు.

ఆ సంస్థ ఇద్దరిని ఇంట్లో పనిమనుషులుగా ఉద్యోగాలు కల్పించింది. అలాగే ఇద్దరు వేర్వేరుగా ఉండాలని చెప్పింది. దీంతో మోసపోయామని తెలుసుకొని స్వదేశంలో ఉన్న తల్లికి విషయం చెప్పారు. ఆమె వారిని మస్కట్‌కు పంపించిన ఏజెంట్ను నిలదీసింది. తన కూతుళ్లను స్వదేశానికి రప్పించాలని కోరింది. అయితే, అక్కడికి పంపించమే తన పని అని ఆ తరువాత తనకు సంబంధం లేదని ఏజెంట్ చేతులెత్తేశాడు. దీంతో వారిని ఉద్యోగాలు కల్పించిన సంస్థను సంప్రదించగా వారు తిరిగి రావాలంటే తలో రూ. 2లక్షలు కట్టాలని అక్కడి యజమానులు డిమాండ్ చేస్తున్నట్లు అజ్మెర బేగం వాపోయింది. తన వద్ద అంత డబ్బు లేదని, ఎలాగైన తన కూతుళ్లను మాతృదేశానికి రప్పించాలని ఆమె విదేశాంగ మంత్రిని కోరింది.