Two-Teens-Arrested-for-Faking-Kidnapping-to-Capture-Prank-Video-

ప్రాంక్ వీడియో తీయబోయి.. ఊచలు లెక్కపెడుతున్న టీనేజర్స్..

జార్జియా: ప్రాంక్ వీడియో కోసం కిడ్నాప్ డ్రామా ఆడారు ఓ యువతి, యువకుడు. అది చూసిన కొందరు నిజం అనుకుని పోలీసులకు సమాచారం అందించారు. దాంతో కిడ్నాప్ డ్రామా ఆడిన యువతి, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి నెట్టారు. అసలేం జరిగిందంటే... జార్జియాకు చెందిన అవా కొలెమన్(17) అనే యువతి, క్రిస్టోఫర్ క్రట్జర్(19) అనే యువకుడు ఇద్దరు కలిసి కిడ్నాప్ నేపథ్యంలో ప్రాంక్ వీడియో చేసి దాన్ని యూట్యూబ్‌లో పెట్టి తమ ఫాలోవర్స్‌ను పెంచుకోవాలనుకున్నారు. దీనికోసం ఓ షాపింగ్ మాల్‌ పార్కింగ్ ప్లేస్‌ను ఎంచుకున్నారు. వారు ముందే అనుకున్నట్లు ఓ వాహనంలో కొలెమన్‌కు మూసుగేసి బ్యాక్ సీటులో బంధించాడు క్రిస్టోఫర్. ఆ తరువాత అతడు డ్రైవింగ్ చేస్తుంటే యువతి నన్ను కిడ్నాప్ చేస్తున్నాడు.. చంపేస్తాడు కాపాడండి.. కాపాడండి అంటూ గట్టిగా అరవడం మొదలెట్టింది. 

అది చూసిన అక్కడి వారు నిజంగా ఆమెను యువకుడు కిడ్నాప్ చేస్తున్నాడేమోనని అనుకొని 911 కాల్ చేసి ఫోర్సిత్ కౌంటీ పోలీసులకు సమాచారం అందించారు. జూలై 3న ఈ ఘటనపై ఒకేసారి పోలీసులకు పలు ఎమర్జెన్సీ కాల్స్ రావడంతో ఇదేదో పెద్ద క్రైమ్‌ అయి ఉండోచ్చని భావించిన ఫోర్సిత్ కౌంటీ పోలీసులు గట్టి బందోబస్తుతో అక్కడికి బయల్దేరారు. భారీ సంఖ్యలో పోలీసులు, వాహనాలు తీసుకొని ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు రంగంలోకి దిగారు. కారు ప్లేట్ నెంబర్ ఆధారంగా క్రిస్టోఫర్ వాహనాన్ని వెంబండించారు. అలా వారి కోసం 20 నిమిషాల పాటు పోలీసులు భారీ ఛేజ్ చేశారు. చివరకు ఎలాగోలా వారి వాహనాన్ని పట్టుకున్న పోలీసులు క్రిస్టోఫర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం చెప్పాడు. కిడ్నాప్‌పై ప్రాంక్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాలనేది తమ ఆలోచన తాపీగా బదులిచ్చాడు. అది విన్న పోలీసులు నిర్ఘాంతపోయారు. దాంతో పోలీసులను తప్పుదోవ పట్టించడంతో పాటు పబ్లిక్‌ను భయబ్రాంతులకు గురి చేసినందుకు కొలెమన్, క్రిస్టోఫర్‌లను అరెస్ట్ చేసి ఫోర్సిత్ కౌంటీ జైలులో పెట్టారు. అనంతరం కొలెమన్‌ను బాండ్‌పై విడుదల చేయగా, క్రిస్టోఫర్‌ మాత్రం కటకటాల్లోనే ఉన్నాడు.