Two-Men-From-Florida-Shocking-act-on-Alligator

తాగిన మైకంలో మొసలిపై ఇద్దరు యువకుల వికృత చర్య..!

ఫ్లోరిడా: తాగిన మైకంలో ఇద్దరు యువకులు మొసలిపై వికృత చర్యకు పాల్పడ్డారు. మొసలి నోట్లో బీరు పోసి వికృతానందం పొందారు. ఈ దారుణ సంఘటన ఫ్లోరిడాలోని పామ్ సిటీలో ఆగస్టు 26న చోటుచేసుకుంది. అయితే, నెట్టింట వీడియో చూసిన ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కమిషన్ అధికారులు సదరు ఇద్దరు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులను అక్టోబర్ 3న అదుపులోకి తీసుకున్నారు.

మార్టిన్ కౌంటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  తిమోతి కెప్కే(27), నోహ్ ఒస్బోర్న్(22) అనే ఇద్దరు యువకులు ఫ్లోరిడాలోని పామ్ సిటీలో ఆగస్టు 26న రోడ్డు పక్కన ఓ మొసలి కనిపించడంతో పట్టుకున్నారు. అనంతరం దానిపై వికృత చర్యకు పాల్పడ్డారు. తాగిన మైకంలో ఉన్న వారిద్దరూ మొసలికి బీరు పట్టించారు. ఆ సమయంలో కెప్కే చేతిని మొసలి గాయపరించిందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అంతర్జాలంలో చూసిన ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కమిషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు వీడియోలోని దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. మొదట కెప్కే ఇంటికి వెళ్లిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అతడి సమాచారంతో వీడియోలో ఉన్న ఒస్బోర్న్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరిపై  అక్టోబర్ 3న మూగజీవిని హింసించడం కింద కేసు మోదు చేసి మార్టిన్ కౌంటీ జైలుకు తరలించారు. అయితే బెయిల్‌పై వారిద్దరు అదే రోజు విడుదలయ్యారు.