Two-foreigners-and-UP-woman-held-for-duping-teacher

అమెరికాలో ఉద్యోగం అని చెప్పి.. మ్యాట్రిమోనీలో స్నేహం చేసి..

సహరాన్‌పూర్, యూపీ: ఎన్నారైనని అబద్దాలు చెప్పి, ఓ మహిళ నుంచి రూ. 9 లక్షలు కాజేసిన వ్యక్తిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సహరాన్‌పూర్ నగరానికి చెందిన రష్మీ బన్సాల్ అనే మహిళ టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. మరో పెళ్లి చేసుకోడానికి మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అవగా.. కిరణ్ కుమార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తన భార్య కూడా చనిపోయిందని, తనకు కూడా ఇద్దరు పిల్లలని రష్మీతో చెప్పి కిరణ్ ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. 

తాను ముంబాయికి చెందిన వాడినని, ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో పనిచేస్తున్నట్టు రష్మీకి చెప్పుకొచ్చాడు. తన పుట్టినరోజును జరుపుకునేందుకు అమెరికా నుంచి ఇండియా వస్తున్నానంటూ రష్మీతో చెప్పాడు. నకిలీ ఫ్లైట్ టికెట్‌ను కూడా ఆమెకు పంపాడు. ‘2.5 లక్షల ఉంగరాన్ని నీకోసం కొని తీసుకొస్తుండగా.. కస్టమ్స్ అధికారులు ఆపేశారు’ అంటూ రష్మీని నమ్మబలికించాడు. తన స్నేహితుడిని కస్టమ్ అధికారిగా మాట్లాడించి రష్మీ దగ్గర నుంచి డబ్బు లాగడం మొదలుపెట్టారు. కిరణ్‌పై కేసు నమోదైందని.. కేసు నుంచి బయటపడేస్తానంటూ రష్మీ నుంచి మొత్తంగా రూ. 9 లక్షలను కాజేశారు. దీంతో చివరకు రష్మీకి అనుమానం వచ్చి సహరాన్‌పూర్ పోలీసులను ఆశ్రయించింది. 
నిందితుల ఐపీ అడ్రస్‌లను ట్రేస్ చేసిన పోలీసులు వారు యూపీలోనే ఉంటున్నట్టు, గౌతమబుద్ద నగర్‌ నుంచి మాట్లాడుతున్నట్టు తెలుసుకున్నారు. బుధవారం వీరిద్దరితో పాటు మరో యువతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల్ హ్యారిస్ అనే వ్యక్తి కిరణ్‌గా ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి రష్మీతో స్నేహం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇక కస్టమ్స్ అధికారిగా జార్జ్ అనే వ్యక్తి నటించినట్టు అధికారులు తెలుసుకున్నారు. వీరిద్దరూ నైజీరియా దేశస్థులని పోలీసులు పేర్కొన్నారు. వీసా పరిమితి అయిపోయినప్పటికీ.. వీరు భారత్‌లో అక్రమంగా నివసిస్తున్నారన్నారు. ఇక వీరికి సహాయం అందించిన శ్రీజ సింగ్ వరాణసి ప్రాంతానికి చెందిన మహిళ అని తెలిపారు.