Two-Asian-Workers-Died-in-UAE-Bus-Accident

యూఏఈలో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు ఆసియా వాసులు మృతి

రాస్ అల్ ఖైమా: రాస్ అల్ ఖైమాలోని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై శుక్రవారం బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు ఆసియా వాసులు మ‌ృతి చెందగా, మరో 31 మంది వరకు గాయపడ్డారు. ముందు ఉన్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆర్ఏకే పోలీస్ అధికారి బ్రిగేడియర్ మహ్మద్ సయీద్ అల్ హుమైద్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తమకు ఈ ప్రమాదం గురించి సమాచారం అందడంతో వెంటనే అంబులెన్స్, పారామెడిక్స్, రెస్క్యూ సిబ్బందితో ప్రమాదస్థలికి చేరుకున్నామని ఆయన పేర్కొన్నారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. చనిపోయిన ఇద్దరి మృతదేహాలను మార్చురీలో భద్రపరిచినట్లు మహ్మద్ సయీద్ తెలిపారు. ఈ ప్రమాదం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఇటీవల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు అతివేగం, అజాగ్రత్తతో కూడిన డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకపోవడం వల్లే సంభవిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.