Trump-speaks-on-phone-to-both-Modi-and-Imran-Khan

ఇమ్రాన్‌కు ఫోనులో హితబోధ చేసిన ట్రంప్..

వాషింగ్టన్:భారత ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం అరగంట సేపు  ఫోనులో సుదీర్ఘ మంతనాలు జరిపిన అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తోనూ ఫోనులో సంభాషణలు జరిపినట్టు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. జమ్మూకశ్మీర్ అంశంపై ఉద్రిక్తతలు తగ్గించాల్సిన అవసరాన్ని చెబుతూ, ఆ అంశంపై భారత్‌తో మితంగా మాట్లాడాలని ఇమ్రాన్‌కు ట్రంప్ సూచించినట్టు శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉభయ దేశాలు సంయమనం పాటించాలని కూడా ఇమ్రాన్‌కు ట్రంప్ సూచించారు. 

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను భారత్ రద్దు చేసినప్పటి నుంచి పాక్ కుతకుతలాడుతోంది. దౌత్య, వాణిజ్యపరమైన సంబంధాలు తెగతెంపులు చేసుకోవడం వంటి చర్యలతో పాటు కశ్మీర్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌, నరేంద్ర మోదీ మధ్య సోమవారం జరిగిన ఫోన్ సంభాషణల్లోనూ కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చింది. కశ్మీర్ అంశంలో భారత్‌పై పాకిస్తాన్ విషం కక్కుతున్న విషయాన్ని మోదీ ఆయన దృష్టికి తెచ్చారు. దక్షిణాసియా ప్రాంతంలోని కొందరు నాయకులు భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం, హింసను ప్రేరేపించడం వల్ల శాంతియుత పరిస్థితులకు విఘాతం కలుగుతుందని కూడా ట్రంప్‌కు విస్పష్టంగా తెలియజేశారు. మోదీ వాదనను అర్థం చేసుకున్న ట్రంప్ ఆ వెంటనే ఇమ్రాన్‌కు ఫోన్ చేసి 'సంయమనం' పాటించాలని, కశ్మీర్ అంశంపై భారత్‌తో మితంగా మాట్లాడాలని హితబోధ చేశారు.

 

Related Articles