Trump-asks-expats-to-leave-US

వలసదారులూ..! గో బ్యాక్‌.. ట్రంప్ నోట మళ్లీ జాతీయవాదం మాట..

  • మళ్లీ ట్రంప్‌ జాతీయవాద ఎజెండా
  • ‘డెమొక్రటిక్‌’ సభ్యురాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు
  •  ఇష్టం లేకపోతే దేశం విడిచిపోవాలని ట్వీట్‌
  • ఇది జాత్యహంకారమే... విదేశీయులపై విద్వేషం
  • నలుగురు మహిళా సభ్యుల ఎదురుదాడి
అధ్యక్షుడిని వేటాడాలని వెంట పడితే, ఈ దేశం, ఈ జెండా... వీటిని దెబ్బతీయాలని చూస్తే...కాపాడ్డానికి నేనున్నా..శ్రీ అమెరికా, ఇజ్రాయెల్‌ గురించి నీచంగా మాట్లాడుతున్నారు. ఇక్కడి ప్రజల గురించి కూడా! అమెరికా ముందెన్నడూ లేనంత బలీయమైన శక్తిగా ఎదిగింది. నిరుద్యోగం లేదు. దేశం సుభిక్షంగా ఉంది. అతివాద వామపక్షవాదులకు ఇంకో పనిలేదు. మీరు ఈ దేశాన్ని ద్వేషిస్తే.. ఇక్కడ సంతోషంగా లేకపోతే.. ఇప్పుడే.. ఈ క్షణమే మీ దేశాలకు వెళ్లిపోవచ్చు.
 డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడు
 
వాషింగ్టన్‌, జూలై 16:అధ్యక్ష ఎన్నికలు మరో ఏడాదిలో జరగనుండడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ తన పాత పల్లవిని అందుకున్నారు. 2015-16లో మాదిరిగా జాతీయవాద ఎజెండాను ఎత్తుకున్నారు. ‘అమెరికాను కాపాడేది నేనే, నా మాటలకు ప్రజామోదం ఉంది, నన్ను, నా విధానాలను విమర్శించేవారంతా దేశ-వ్యతిరేకులు’ అని స్పష్టంగా చెబుతూ ఎన్నికల ఎజెండాను నిర్దేశించేశారు. డెమొక్రాట్లయిన నలుగురు మహిళా సభ్యులను ఆయన తన దాడికి లక్ష్యంగా చేసుకున్నారు. ‘ఇక్కడ సంతోషంగా లేకపోతే మీరు స్వదేశాలకు ఇప్పుడే, ఈ క్షణమే వెళ్లిపోండి’ అని ఘాటుగా ట్వీట్‌ చేశారు.
 
ఆ నలుగురూ అమెరికా పౌరసత్వం ఉన్న వారే అయినప్పటికీ వారి మూలాలు ఆఫ్రికా, అరబ్‌, ఇతర దక్షిణ అమెరికా దేశాల్లో ఉన్నాయి. ఈ నలుగురూ- అలెగ్జాండ్రియా ఒకాషియో-కార్టెజ్‌ (న్యూయార్క్‌) , రషీదా త్లయీబ్‌ (మిషిగన్‌), అయానా ప్రెస్లీ (మసచుసెట్స్‌), ఇల్హాన్‌ ఒమర్‌ (మినెసొటా)- సోషలిస్ట్‌ భావాలున్నవారు. ప్రగతిశీల సభ్యులుగా పేరుపడ్డ వారు. వీరిలో మొదటి ముగ్గురూ అమెరికాలో పుట్టి పెరిగినవారే. ఒక్క ఒమర్‌ మాత్రం సోమాలియా నుంచి పసిబిడ్డగా ఉన్నపుడే వచ్చి పౌరసత్వం పొందారు. హిస్పానిక్స్‌నీ (స్పానిష్‌ మాట్లాడే దేశాల నుంచి వచ్చే ఉత్తర, దక్షిణ అమెరికా దేశాల వారినీ), అరబ్‌, ఆఫ్రికన్‌లనీ అమితంగా ద్వేషించే ట్రంప్‌కు ఈ నలుగురూ కంట్లో నలుసులా తయారయ్యారని విశ్లేషకులంటారు.
 
వారు అల్‌ఖైదాకు అనుకూలురు: ట్రంప్‌
అక్రమంగా వలస వచ్చినవారిని నిర్బంధించే డిటెన్షన్‌ సెంటర్లలో పరిస్థితులపై ఏర్పాటైన కాంగ్రెస్‌ కమిటీ ఎదుట ఈ నలుగురు మహిళలూ హాజరై - వాటి స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయని అన్నారు. తరువాత మీడియాలో కూడా ఇది ప్రముఖంగా రావడంతో ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. ‘అవి చిత్రహింసల శిబిరాలు కావు. విధానాలను విమర్శించడమే వీరి లక్ష్యం.. నిత్యం ఏదో ఒక ఫిర్యాదు చేస్తారు. విషం, విద్వేషం కక్కుతున్నారు. ఇంత నీచంగా, జుగుప్సాకరంగా మాట్లాడిన నేతల్ని నేను ఎన్నడూ చూడలేదు. వారు అమెరికాకు, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకులు.. అల్‌ ఖైదాకు అనుకూలురు. 2001లో అమెరికాపై దాడులు చేసిన అల్‌ఖైదా ఉగ్రవాదులను సమర్థిస్తారు. ఈ నలుగురు అతివాద సభ్యురాళ్లను డెమొక్రాట్లు సమర్థించడం దారుణం. మీరు నన్ను వెంటాడితే నన్ను నేను రక్షించుకోగలను. దేశాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే అడ్డుపడతా.’’ అని ట్రంప్‌ వరుస ట్వీట్‌లలో ధ్వజమెత్తారు.
 
ట్రంప్‌ క్షమాపణకు డిమాండ్‌
దీనిపై ఆ నలుగురూ మండిపడ్డారు. ట్రంప్‌ వ్యాఖ్యలు విదేశీయులపై విద్వేషానికి నిదర్శనమని, శ్వేతజాతి దురహంకారానికి ప్రతిరూపమని, నల్ల జాతీయుల పట్ల వివక్ష అంటూ వారు దుమ్మెత్తిపోశారు. అసలు విషయం వదిలేసి, తమ జాతీయత, నేపథ్యం... గురించి మాట్లాడుతున్నారని, చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. కానీ ఆయన తిరస్కరించారు. ‘చేసిన వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నాను. నా మాటలు వారికి రుచించవు. కానీ దేశప్రజలకు నచ్చుతాయి..వారు నా మాటలతో ఏకీభవిస్తారు...’ అని ఆయన వైట్‌హౌ్‌సలో మీడియాతో అన్నారు. అయితే ట్రంప్‌ వ్యాఖ్యలపై అనేక వర్గాల్లో తీవ్ర విమర్శలు రేగాయి. ఇవి జాత్యహంకార, మహిళాద్వేషంతో కూడినవని డెమొక్రాట్లు దుయ్యబట్టారు. వీటిని ఖండిస్తూ కాంగ్రె్‌సలో ఓ తీర్మానం తెస్తామని స్పీకర్‌ నాన్సీ పెలోసీ చెప్పారు.