Top-Chef-host-Padma-Lakshmi-cooks-Donald-Trump

ట్రంప్‌‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ ఎన్నారై

వాషింగ్టన్: అమెరికాలో టాప్ చెఫ్ అనే షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పద్మలక్ష్మీ అనే ప్రముఖ ఎన్నారై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రాత్రి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికరమైన మాటలు చెప్పారు. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ అంబాసడర్‌గా తాను అందించిన సేవల గురించి చెప్తూ అమెరికా రావడానికి ఆమె ఎదుర్కొన్న కష్టాల గురించి తెలిపారు. బోర్డర్ వాల్ కారణంగా సంక్షోభం ఎదురవుతోందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ..  ‘సరిహద్దు ప్రజల లాగే నేను కూడా ఇక్కడకు మా అమ్మతో కలిసి వచ్చాను. ఎంతో మంది అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశిస్తున్నారంటే.. వారు నివసించే ప్రదేశం ఎంత ప్రమాదకరంగా, అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నామని తెలిసి కూడా ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని అమెరికాలో నివసించడానికి వస్తున్నారు. అమెరికా ఈ రోజు ఈ స్థానంలో ఉందంటే.. అందులో ఇమ్మిగ్రెంట్ల కృషి ఎంతో ఉంది.’ అని చెప్పారు. ‘ట్రంప్ చెప్పినట్టుగా సంక్షోభం అనేది అమెరికాలో లేదు. అమెరికా లాంటి శక్తిమంతమైన దేశానికి ట్రంప్ లాంటి వెర్రివాడు అధ్యక్షుడిగా ఉన్నారు అంతే’ అని తీవ్ర విమర్శలు చేశారు.