Tollywood-hero-arrested-for-cheating-people-with-a-fake-Dubai-company

దుబాయిలో తెలుగు హీరో దొంగ వ్యాపారం.. ఎంబసీ ఫిర్యాదుతో..

దుబాయి: తెలుగు చలనచిత్ర పరిశ్రమ (టాలీవుడ్)కు చెందిన ఓ హీరో దుబాయిలో నకిలీ వ్యాపారం చేస్తూ, అమాయకులను మోసం చేస్తున్నట్లు దుబాయిలోని భారతీయ ఎంబసీ గుర్తించింది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకోవాలని హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎంబసీ ఫిర్యాదు అందుకున్న పోలీసులు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే వెళ్లి టాలీవుడ్ హీరో రహీం బషీద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

తెలుగులో ‘ఎవడ్రా హీరో’ సినిమాలో హీరోగా నటించిన రహీం.. ప్రైవేటు, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రుణాలిప్పిస్తానంటూ అమాయకులను మోసం చేసేవాడని, ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.30లక్షలు చొప్పున వసూలు చేసేవాడని దర్యాప్తులో తేలింది. దీనికోసం దుబాయిలో ఎస్‌బీకే గ్రూప్ పేరుతో దొంగ కంపెనీని సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, బంజారాహిల్స్ తదితర పోలీస్‌స్టేషన్లలో రహీంపై పలుకేసులు నమోదైనట్లు కూడా వెల్లడించారు.